AP Assembly Elections 2024: నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలపై కత్తిరింపుల కత్తి
ఎందర్ని తప్పిస్తారో తెలియక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎమ్మెల్యేలు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను..

NELLORE YCP politics
YSRCP: నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరో తెలుసా? ఓ సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ ఇది.. వాస్తవ జీవితంలో కూడా నెల్లూరోళ్లు పెద్దారెడ్లే అన్న భావనతోనే ఉంటారు జనం.. ఇక రాజకీయాల్లో నెల్లూరు రెడ్ల హవా అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా అధికార వైసీపీలో నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం నేతలదే పెత్తనమంతా.. ఎవరూ తగ్గరు… తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతుంటారు.. ఆ స్పీడే ఇప్పుడు నెల్లూరులో రెడ్డి నాయకులకు కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది. వైసీపీ అధిష్టానం చేపట్టిన ప్రక్షాళనలో నెల్లూరులో ఎమ్మెల్యేలపై కత్తిరింపుల కత్తి వేలాడుతోంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా అధికార వైసీపీకి కంచుకోట… గత ఎన్నికల్లో పదికి పది స్థానాల్లోనూ గెలిచింది వైసీపీ.. కానీ, వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదంటున్నారు పరిశీలకులు. పార్టీకి పట్టున్న ప్రాంతంలో ఎందుకీ పరిస్థితి అని పోస్టుమార్టం చేస్తున్న హైకమాండ్‌కు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి.
ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల దురుసు ప్రవర్తన.. అవినీతి ఆరోపణలతో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నట్లు గ్రహించింది అధినాయకత్వం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇలాంటి వారి అందరినీ తప్పించాలని భావిస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో గెలిచిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు… టీడీపీలో చేరిపోగా.. ఉన్న ఏడుగురిలో ఎందరిని కంటిన్యూ చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరోపణలు
మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మినహా మిగిలిన వారి పనితీరుపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారందరినీ…. తప్పిస్తారా? లేక స్థానచలనం ఇస్తారా? అన్న డౌట్ వస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్‌కు వీర విధేయుడు, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను మరోచోటకు మార్చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం హీట్‌పుట్టిస్తోంది.
Robin Sharma: ఇప్పటికే టీడీపీ తరఫున రాబిన్ శర్మ.. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్.. ఏం చేస్తున్నారో తెలుసా?
నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్.. సీఎం జగన్ భక్తుడు… అన్న శాసిస్తాడు.. అనిల్ పాటిస్తాడన్న రేంజ్‌లో డైలాగ్‌లు వేస్తుంటారు ఆయన… గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన అనిల్‌కుమార్ యాదవ్ వరుసగా మూడోసారి సిటీ నుంచి పోటీ చేస్తారా? అన్నదే ఇప్పుడు డౌట్..! పనితీరు బాగున్నా.. సీఎం జగన్ ఆశీస్సులు ఉన్నా… క్షేత్రస్థాయిలో అనిల్‌కుమార్ యాదవ్‌పై క్యాడర్ అసంతృప్తితో ఉందంటున్నారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే సొంత బాబాయి… డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ వ్యతిరేకిస్తుండటంతో అనిల్ పరిస్థితి ఏంటన్న సందేహం వెంటాడుతోంది. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రూరల్ ఇన్‌చార్జి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితోనూ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌కు సత్సంబంధాలు లేవంటున్నారు.
దీంతో వీరంతా అనిల్‌కుమార్ యాదవ్‌ను మార్చాలనే ప్రతిపాదన చేస్తుండటం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమవుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో అనిల్‌కుమార్ యాదవ్‌ను ఐతే వెంకటగిరి లేదంటే కావలికి మార్చేస్తారనే ప్రచారం జరుగుతోంది..
సైకిల్‌పై సవారీ
ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పటికే ఫ్యాన్ స్పీడ్‌ను తగ్గించేసి.. సైకిల్‌పై సవారీ చేస్తున్నారు. ఈయన స్థానంలో బాధ్యతలు అప్పగించిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి దూసుకుపోతున్నట్లే కనిపిస్తున్నారు. అయితే సిటీ ఎమ్మెల్యే అనిల్‌ను కావలికి మార్చేస్తారన్న ప్రచారంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డికి టెన్షన్ పట్టుకుందట…. కావలి ఎమ్మెల్యేపై క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉందంటున్నారు.
నిన్నమొన్నటి వరకు ఆయన వెంటే ఉండి షాడో ఎమ్మెల్యేగా పనిచేసిన సుకుమార్ రెడ్డే ఇప్పుడు ఎమ్మెల్యేకు తలనొప్పులు సృష్టిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించేలా అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. దీంతో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిని నెల్లూరు ఎంపీగా పంపాలనే ప్రతిపాదన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక జిల్లాలో కీలక నియోజకవర్గాలపై కోవూరు, ఆత్మకూరుల్లో ఎలాంటి మార్పు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మొదటి నుంచి సీఎం జగన్‌కు నమ్మిన బంటు.. ఇక ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డిపై ఎలాంటి వ్యతిరేకత లేదు. పైగా ఆయన కుటుంబ నేపథ్యం వల్ల విక్రమ్‌రెడ్డి విషయంలో రెండో ఆలోచన చేయడం లేదు వైసీపీ హైకమాండ్.. మరోవైపు మేకపాటి కుటుంబం ఆధిపత్యంలో ఉన్న ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఎవరొస్తారనేదే ఆసక్తికరంగా మారింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరగా.. ప్రస్తుతం తాత్కాలికంగా మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి బాధ్యతలు చూస్తున్నారు. ఐతే ఆయన వయసు దృష్టిలో పెట్టుకుని ఉదయగిరికి మరొకరిని నియమించాలని చూస్తోంది వైసీపీ…. రేసులో ఎంపీపీ స్థాయి నాయకుల పేర్లు వినిపిస్తుండగా… అంగ బలం, అర్ధ బలం ఉన్న నాయకులనే ఇక్కడ సమన్వయకర్తగా నియమించే అవకాశం ఉంది.
చాలావరకు డ్యామేజ్
ఇక గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పనితీరుతో నియోజకవర్గంలో పార్టీ చాలావరకు డ్యామేజ్ అయినట్లు సర్వేలు చెబుతున్నాయి. నేను మోనార్క్‌ని అన్నట్లు ఎమ్మెల్యే వ్యవహరిస్తుండటం వల్ల… దాదాపు రెడ్డి సామాజికవర్గమంతా దూరంగా ఉంటోంది. ఎమ్మెల్సీలు మురళి, బల్లి కళ్యాణ్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నడుచుకుంటుండటం… ఎమ్మెల్యే వరప్రసాద్‌పై అవినీతి ఆరోపణలుతో మార్పు లిస్టులో గూడురు పేరు తప్పకుండా ఉంటుందని అంటున్నారు.
అటు సూళ్లూరుపేటలోనూ వైసీపీ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని సర్వేల్లో తేలిందనే సమాచారం సిట్టింగ్ ఎమ్మెల్యేకు గుబులు పుట్టిస్తోంది. ఎమ్మెల్యే సంజీవయ్యపై నియోజకవర్గ ప్రజలతోపాటు అధికార పార్టీ నాయకుల్లోనూ పాజిటివ్ టాక్ లేదని గుర్తించింది హైకమాండ్. దీంతో సూళ్లూరుపేట వైసీపీ ఇన్‌చార్జిని మారుస్తారనే వాదన బలంగా ఉంది.
టెన్షన్..
ఇక వెంకటగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే పార్టీకి బైబై చెప్పేశారు. ఈయన స్థానంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వారసుడు రామ్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రామ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నా… కొందరు ముఖ్య నేతలు పార్టీకి దూరంగా ఉండటంతో టెన్షన్ పడుతోంది వైసీపీ అధినాయకత్వం… ఇక్కడ రామ్‌కుమార్‌రెడ్డిని కొనసాగిస్తారా? లేక ప్రత్యామ్నాయం చూస్తున్నారా? అన్న క్లారిటీ లేదు.
ఇలా నెల్లూరు జిల్లాలో వైసీపీ కంచుకోటకు బీటలు వారే పరిస్థితి కనిపిస్తుండటంతో జాగ్రత్త పడుతోంది వైసీపీ అధిష్టానం… పది మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే ముగ్గురు దూరమవగా.. ఉన్న ఏడుగురిలో ఎందరు కొనసాగుతారో… ఎందర్ని తప్పిస్తారో తెలియక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎమ్మెల్యేలు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను తాడేపల్లి పిలిపిస్తూ క్లారిటీ ఇచ్చేస్తున్న సీఎం జగన్…. ఆ ప్రక్రియకు తాత్కాలిక విరామం ఇవ్వడంతో ఈ టెన్షన్ ఎన్నాళ్లు అనుభవించాల్సివస్తుందోనని ఆందోళనలో కనిపిస్తున్నారు నెల్లూరు ఎమ్మెల్యేలు.
Prashant Kishor: చంద్రబాబుతో 3 గంటలపాటు చర్చించాక ప్రశాంత్ కిశోర్ ఏం చెప్పారో తెలుసా?