మంథని లాయర్స్ హత్య : బిట్టు శ్రీను నేర చరిత్ర!

Manthani Lawyers Murder : వామన్‌రావు హత్య కేసులో నిందితునిగా ఉన్న బిట్టు శ్రీనుకు కూడా నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్‌ అయిన పుట్ట మధుకు మేనల్లుడైన బిట్టు శ్రీనుపై గతంలో రౌడీషీట్‌ ఓపెన్‌ అయింది. పుట్ట మధుకు రాజకీయంగా ఎవరైనా అడ్డువచ్చినా, విమర్శించినా బిట్టు శ్రీను తట్టుకోలేకపోయేవాడు. వారిపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పుట్ట మధు తల్లి పుట్ట లింగమ్మ పేరుతో ఏర్పాటు చేసిన చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న బిట్టు శ్రీనుకి మొదటి నుంచి నేర చరిత్ర ఉంది. మంథని మాజీ సర్పంచ్‌ ఇనుముల సతీష్‌, షబ్బీర్‌, ఆకుల శ్రీనివాస్‌లపై అనుచరులతో కలిసి దాడి చేశాడు బిట్టు శ్రీను. దందాలు, గొడవలతో హల్‌చల్‌ చేసేవాడు. ఈ క్రమంలోనే అతనిపై రౌడీ షీట్‌ కూడా ఓపెన్‌ అయింది. అయితే పుట్ట మధు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. అతనిపై ఉన్న రౌడీ షీట్‌ తొలగించారు పోలీసులు.

మంథని నియోజకవర్గంలో జరిగే ప్రతి దందాలోనూ మామూళ్లు వసూలు చేస్తాడని బిట్టు శ్రీనుపై ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో జరిగే ఇసుక అక్రమ రవాణాలో బిట్టు శ్రీను ఆరితేరినట్టుగా సమాచారం. అక్కడ జరిగే ప్రతి సెటిల్‌మెంట్‌లోనూ అతని ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తోంది. పుట్ట మధు రాజకీయ కార్యకలాపాలు దగ్గరుండి చూసుకుంటూ.. రైట్‌ హ్యాండ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదే క్రమంలో వామన్‌రావును అంతమొందించేందుకు స్కెచ్‌ వేశాడు. వామన్‌రావు దంపతుల హత్యలో ప్రధాన సూత్రధారిగా బిట్టు శ్రీను వ్యవహరించాడు. హంతకులకు కారు, కత్తులు సరఫరా చేయడమే కాకుండా వారికి సుపారీ కూడా తానే సమకూర్చినట్టు తెలుస్తోంది.