Operation Kagar
Operation Karreguttalu: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన కీకారణ్యంలో మావోయిస్టుల స్థావరాల గుర్తింపు లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా అడవుల్లో జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులకు పెట్టని కోటలాగా కర్రెగుట్టలు ప్రాంతం ఉంది. 145 ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రెగుట్టలను భద్రతా బలగాలు ముట్టడించి భీకర కాల్పులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన రెండు రోజుల్లోనే భద్రతాబలగాల కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోలు హతమయ్యారు.
కర్రెగుట్టల్లో జరుగుతున్న భీకరకాల్పులపై ప్రజాస్వామ్య వాదులు, పౌరహక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్రెగుట్టల నుంచి భద్రతాబలగాలు వెనక్కి రావాలని, శాంతి చర్చలు జరపాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ఆపరేషన్ కగార్ మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నామని తెలిపింది.
కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ పేరిట లేఖ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్టు పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ ను ప్రముఖంగా చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మా నుండి ఆరు నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తున్నామని ప్రకటిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.