KTR (Image Credit To Original Source)
KTR: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీని కాపాడుకోవడానికి పోరాటానికి దిగుతామని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, నందినగర్‌లో కేటీఆర్‌తో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు సమావేశమై చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలపై రేవంత్ రెడ్డి సర్కార్ కన్నేసింది. రెండున్నరేళ్లల్లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. యూనివర్సిటీని అభివృద్ధి చేస్తాం. యూనివర్సిటీని కాపాడుకోవటానికి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తాం. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో రేవంత్ చూపిస్తున్నారు.
దేశంలో ఉన్న ఒకే ఒక్క ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ ఉంది.. అది హైదరాబాద్‌లోనే ఉంది. నేషనల్ యూనివర్సిటీని రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తుంది. రియల్ ఎస్టేట్ అవసరాల కోసం యూనివర్సిటీ భూములపై కన్ను వేసింది. హైదరాబాద్ అవసరాల కోసం గతంలో ఈ వర్సిటీ అండగా ఉంది.
ఓఆర్ఆర్ కోసం గతంలో 32 ఎకరాలను మౌలానా యూనివర్సిటీ ఇచ్చింది. లింక్ రోడ్ కోసం 7 ఎకరాలు ఇచ్చింది. తెలంగాణలో యూనివర్సిటీ భూములను లాక్కోవటం ఓ సీరియల్ మాదిరిగా జరుగుతోంది. జయశంకర్ యూనివర్సిటీలో రేవంత్ సర్కార్ 100 ఎకరాలను తీసుకుంది.
సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలపై కన్నేస్తే.. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది. బడే బాయ్, చోటే బాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రేవంత్ రూ.10 వేల కోట్ల కుంభకోణానికి కేంద్రం మద్దతుగా ఉంది. హైదరాబాద్‌కు తలమానికంగా ఉర్దూ యూనివర్సిటీ ఉంది.
ప్రభుత్వం ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని, ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నాలు చేసింది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ, విద్యార్థుల ఆందోళన, ప్రజల వ్యతిరేకత, సుప్రీంకోర్టు జోక్యం వల్ల తాత్కాలికంగా ఆగింది” అని అన్నారు.
రాహుల్ గాంధీపై మళ్లీ కామెంట్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ మళ్లీ మండిపడ్డారు. “మైనారిటీలకు రక్షకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడాలి. రాహుల్ గాంధీకి దమ్ముంటే అశోక్ నగర్‌కు రావాలి. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారు? అశోక్ నగర్‌లో విద్యార్థులను గొడ్డును బాధినట్లు బాదుతున్నారు” అని అన్నారు.