×
Ad

Medaram Jatara : నేటి నుంచి మేడారం మహాజాతర.. జాతరలో అత్యంత కీలక ఘట్టం ఏంటో తెలుసా..

Medaram Jatara : మేడారం మహాజాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 31వ తేదీ వరకు జరుగుతుంది.

medaram maha jatara

  • మేడారం మహాజాతర ప్రారంభం
  • ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనున్న జాతర
  • సారలమ్మ రాకతో మొదలు..
  • దేవతల వన ప్రవేశంతో ముగియనున్న జాతర

Medaram Jatara : దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ జాతర ఇవాళ్టి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. 28, 29, 30, 31 తేదీల్లో నాలుగు రోజుల పాటు మహాజాతర జరగనుంది. అయితే, ఈరోజు సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రానున్నారు. (medaram maha jatara)

Also Read : Doomsday Clock 2026 : ప్రపంచం వినాశనానికి మరింత దగ్గరైందా..! డూమ్స్‌డే గడియారం ఏం చెప్పింది.. ఈ వాచ్ గురించి మీకు తెలుసా?

బుధవారం సాయత్రం 6గంటల సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత కన్నెపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపు ఏటూరునాగారం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిగద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. ఇప్పటికే కొండాయి నుండి గోవిందరాజు, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు కాలి నడకన బయలుదేరారు. పూనుగొండ్ల నుండి 65 కి.మీ నడుచుకుంటూ పగిడిద్దరాజుతో పూజారులు మేడారంకు వస్తారు. సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్వాగతం పలకనున్నారు.

జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను గురువారం కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలుకల గుట్టపై నుంచి తీసుకొస్తారు. కుంకుమభరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. శుక్రవారం భక్తులు దర్శించుకొని ఎత్తు బంగారాలను సమర్పించడం ఆనవాయితీ. శనివారం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాన కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతరను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకలుగా కొలిచే సమ్మక్క–సారలమ్మ జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మేడారం మహా జాతరకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13వేల మంది పోలీసులతో జాతర భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మేడారాన్ని సుమారు 45లక్షల మందికిపైగా దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నాలుగు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలిరానున్నారు.