Medical Shops Strike : దేశంలో మెడికల్ షాపులు బంద్.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో మాత్రం తెరిచే ఉంటాయి.. ఎందుకంటే?

Medical Shops Strike : ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించి నకిలీ మందుల అమ్మకాలను నివారించాలనే డిమాండ్లతో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ ప్రతినిధులు పేర్కొన్నారు

Medical Shops Strike

  • మే20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్
  • ఏపీ, తెలంగాణలోకూడా కొనసాగనున్న బంద్
  • కొన్ని ప్రాంతాల్లో మాత్రం తెరుచుకోనున్న మెడికల్ షాపులు

Medical Shops Strike : ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం (మే20న) దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మెడికల్ స్టోర్స్ తెరిచి ఉంటాయి.

Also Read : Rain Alert : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నైరుతి రుతుపవనాలపై కీలక అప్డేట్.. ఈ జిల్లాల్లో వర్షాలు.. భారీగా ఈదురుగాలులు..

ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించి నకిలీ మందుల అమ్మకాలను నివారించాలనే డిమాండ్లతో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే, ఈ బంద్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

బుధవారం బంద్ కారణంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూత పడుతున్నప్పటికీ.. ఆసుపత్రుల అనుబంధ ఫార్మసీలు అంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఉండే అన్ని మెడికల్ దుకాణాలు 24గంటలపాటు తెరిచే ఉంటాయి. అంతేకాదు.. అపోలో, మెడిప్లస్ వంటి పెద్ద కార్పొరేట్ ఫార్మసీ చైన్ నెట్‌వర్క్‌లు కొన్ని ప్రాంతాల్లో సేవలు అందిస్తాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జన ఔషదీ కేంద్రాలు, అమృత్ ఫార్మసీ ఔట్ లెట్లు పూర్తిగా అందుబాటులో ఉంటాయి.

దేశవ్యాప్తంగా బుధవారం మెడికల్ దుకాణాలు బంద్ అవుతున్నప్పటికీ.. అత్యవసర మందుల కొరత రాకుండా ఉండేందుకు వీలుగా నగరాల్లోని ప్రధాన కూడళ్లలో రెండు నుండి మూడు డివిజన్లకు ఒకటి చొప్పున, అలాగే గ్రామాల్లో ప్రతి రెండు మూడు గ్రామాలకు ఒక మెడికల్ షాపు చొప్పున అసోసియేషన్ ప్రతినిధులు తెరిచి ఉంచుతారు.

ఇదిలాఉంటే.. బుధవారం జరిగే సమ్మె నుంచి పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర కర్ణాటక, హరియాణా, ఉత్తరప్రదేశ్, లద్దాక్, గుజరాత్, చత్తీస్‌గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్‌కు చెందిన రిటైల్ ఫార్మసీ అసోసియేషన్లు వైదొగిలాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సమ్మె ప్రభావం ఉంటుంది. ఒకవేళ అత్యవసర ముందులు అవసరం అయితే, డీసీఏ టోల్ ఫ్రీ నంబర్‌ 1800 599 6969కి కాల్ చేయొచ్చునని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక సూచన చేసింది.