Bathka Vaishnavi: తెలంగాణ అమ్మాయి సంచలనం.. జాతీయ ఉషు పోటీలకు వైష్ణవి ఎంపిక.. విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేక అభినందనలు!
బాత్క వైష్ణవి(Bathka Vaishnavi) జాతీయ స్థాయి ఉషు పోటీలకు ఎంపికై రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది.
Telangana student vaishnavi selected for 70th sgf national wushu championship in srinagar
Bathka Vaishnavi: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని నేదునూరు మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని బాత్క వైష్ణవి(Bathka Vaishnavi) జాతీయ స్థాయి ఉషు (Wushu) పోటీలకు ఎంపికై రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ’ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వైష్ణవి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అండర్-17 విభాగంలో, 56 కిలోల కేటగిరీలో తన ప్రతి ప్రత్యర్థినీ చిత్తు చేస్తూ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. వైష్ణవి తండ్రి శ్రీశైలం క్రీడల్లో ఆమెకు నిరంతరం మద్దతుగా నిలుస్తూ ప్రోత్సహించడంపై క్రీడాభిమానులు, గ్రామస్తులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్లో 70వ ఎస్జీఎఫ్ జాతీయ పోటీలు.. తెలంగాణ ప్రతినిధిగా బరిలోకి:
ఈ నెల అక్టోబర్ 15 నుండి 19 వరకు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ వేదికగా జరగనున్న 70వ ఎస్జీఎఫ్ జాతీయ ఉషు ఛాంపియన్ షిప్లో వైష్ణవి తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నవీన్ నికోలస్ ఈ ఉషు యోధురాలిని ప్రత్యేకంగా అభినందించారు. శ్రీనగర్‌లో జరగబోయే జాతీయ వేదికపై కూడా ఇదే తరహా పంచ్‌లతో అద్భుత ప్రతిభను కనబరిచి రాష్ట్రానికి బంగారు పతకం సాధించి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
నేదునూరు మోడల్ స్కూల్లో ఘన సత్కారం.. పసిడి పతకమే లక్ష్యంగా ప్రిన్సిపాల్ పిలుపు:
జాతీయ పోటీలకు ఎంపికై పాఠశాలకు, ప్రాంతానికి విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వైష్ణవిని నేదునూరు మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు, అధికారులు ఘనంగా సత్కరించారు. మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణు ప్రియ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వైష్ణవికి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ వేదికపై నేదునూరు పాఠశాల కీర్తిని, తెలంగాణ ఘనతను చాటి చెప్పాలని, బంగారు పతకంతో తిరిగి రావాలని ప్రిన్సిపాల్ విష్ణు ప్రియ కోరారు.
