మళ్లీ భారీ శబ్ధాలు, ప్రకంపనలు.. పెను ప్రమాదంలో మేడిగడ్డ ప్రాజెక్ట్‌..!

ఈ వర్షాకాలంలో వచ్చే భారీ వరదలకు బ్యారేజీ తట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మళ్లీ భారీ శబ్ధాలు, ప్రకంపనలు.. పెను ప్రమాదంలో మేడిగడ్డ ప్రాజెక్ట్‌..!

Medigadda Barrage : మేడిగడ్డలో మరమ్మత్తులు సాధ్యమేనా..? ఆ ప్రాజెక్ట్‌ పిల్లర్లు సేఫ్‌గా ఉన్నాయా? అధికారులు ఏం చేయబోతున్నారు.? ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణ ప్రజానీకాన్ని వెంటాడుతున్నాయి. అసలే వర్షాకాలం మొదలుకానుంది. వరదలు పోటెత్తుతాయి. మరి ఆ వరదల తీవ్రతను తట్టుకొని మేడిగడ్డ పిల్లర్లు నిలబడతాయా..? మరమ్మత్తులు చేసే వేళ వినిపించిన శబ్ధాలు దేనికి సంకేతం. అధికారులు ఈ సమస్యను ఎలా డీల్‌ చేయబోతున్నారు?

బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్ధాలు, ప్రకంపనలు..!
కరీంనగర్ జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్ధాలు, ప్రకంపనలు వచ్చాయి. కుంగిన ఏడో బ్లాకులోని గేట్లు ఎత్తే క్రమంలో భారీ శబ్దాలు వినిపించాయి. 7వ బ్లాక్ పిల్లర్ల కింద భారీగా హోల్‌ ఏర్పడినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో వెంటనే గేట్లు ఎత్తే పనులను నిలిపేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్‌ చేశాయని అధికారులు తెలిపారు. దీంతో గేట్లు ఎత్తే పనులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జియో ఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాతే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది.

గేటు ఎత్తితే.. పిల్లర్లు మరింత కుంగే ప్రమాదం..!
గతంలో భారీ వరదలతో బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయింది. దీంతో 12వేల నుంచి 15వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడినట్లు జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షల ద్వారా అధికారులు అంచనాకు వచ్చారు. అయితే తాజాగా టన్నుల కొద్ది బరువు ఉండే గేటును పైకి ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడి బ్యారేజీ పిల్లర్లు మరింత కుంగే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. భారీగా ఏర్పడిన హోల్‌ను గ్రౌండింగ్ ద్వారా పూడ్చి వేశాకే గేట్లను పైకెత్తి పనులు చేపట్టాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 7వ బ్లాక్‌లో పిల్లర్లు కుంగిన తర్వాత లీకేజీలు ఆపడానికి 40వేల ఇసుక బస్తాలను వేశారు.

వరదల సమయంలో ప్రమాద సంకేతాలు..
మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు ఉండగా అందులో 85 గేట్లు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 21న 7బ్లాక్ కుంగిన వెంటనే ఆ బ్లాక్ లోని 15 నుంచి 22వ నంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం లోపాలను తెలుసుకునేందుకు నేషనల్ డ్యాo సేఫ్టీ అథారిటీ.. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. 2019 జూలై నెలలో వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను తెలిపిందని ఆ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పగుళ్లు వచ్చిన 19, 20, 21 పిల్లర్స్ మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది.

భారీ వరదలకు బ్యారేజీ తట్టుకుంటుందా?
అయ్యర్ కమిటీ సూచన మేరకు నీటిపారుదల శాఖ అధికారులు, ఎల్ అండ్ టి సిబ్బందితో కలిసి ఈనెల 17న 15వ నెంబర్ గేటును పైకి ఎత్తారు. తర్వాత గురువారం 16వ నంబర్ గేట్ ఎత్తడానికి ప్రయత్నించగా భారీ శబ్దాలు ప్రకంపనలు వచ్చాయి. దీంతో బ్యారేజీ కింద హోల్స్‌ ఏర్పడ్డాయని అధికారులు నిర్ధారించారు. మేడిగడ్డ బ్యారేజీ కింది భాగంలో ఏర్పడిన హోల్స్ ఎంత మేరకు ఉన్నాయో ఒక స్పష్టత వచ్చాకే గేట్లు ఎత్తాలన్న నిర్ణయానికి వచ్చారు. జియో ఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాత.. నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక, సిమెంట్‌ మిశ్రమాన్ని హోల్స్‌కి పంపించి పూడ్చి వేయాలని భావిస్తున్నారు. అయితే ఈ వర్షా కాలంలో వచ్చే భారీ వరదలకు బ్యారేజీ తట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.