Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించాలి..
Rain Alert : తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శని, ఆది, సోమవారాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Harishth Thanniru
- Published On : April 4, 2026 / 06:51 AM IST
Rain Alert
Rain Alert : తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి ఏర్పడగా.. దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో యానాం తీరంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు IMD (India Meteorological Department) తెలిపింది. ఈ కారణంగా తెలంగాణలో శని, ఆది, సోమవారాల్లో వర్షాలు పడుతాయని తెలిపింది.
Also Read : Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు వచ్చేస్తున్నాయ్.. రెండో విడత వచ్చేది ఎప్పుడంటే..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాతోపాటు ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
మూడ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. రైతులు రబీలో సాగుచేసిన పంటలు ప్రస్తుతం చేతికందే దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు కల్లాల్లో ఆరబోశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరి, మొక్కజొన్న, మిరప తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసన వర్షాల కారణంగా రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనధ్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ములో 40.1, ములుగు జిల్లా మంగపేటలో 39.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.
