Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు వచ్చేస్తున్నాయ్.. రెండో విడత వచ్చేది ఎప్పుడంటే..
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద రెండో విడతలో రూ.2,650కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
Rythu Bharosa
- తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- ఈనెల రెండో వారంలో రెండో విడత రైతు భరోసా నిధులు
- ఏప్రిల్ నెలాఖరుకు మిగతా రైతులకు మూడో విడతలో నిధులు
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులకు సంబంధించి రెండో విడత నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఈనెల రెండో వారంలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖను సర్కార్ ఆదేశించింది. దీంతో అధికారులు నిధులు విడుదలకు చర్యలు వేగవంతం చేశారు.
Also Read: Gold Price Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతీయేటా పంటలు సాగుచేసే రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12వేలు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఖరీఫ్ సాగుకు సంబంధించి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం రబీ సాగుకు సంబంధించిన నిధులను ప్రతీ ఎకరాకు రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది.
రబీ సాగుకు సంబంధించి మొదటి విడతలో ఇప్పటికే 70లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. గత మార్చి 22న రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రెండో విడతలో భాగంగా 2,650 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఐదు ఎకరాల వరకు కలిగిన రైతులకు రెండో విడుత నిధులు జమకానున్నాయి.
మూడో విడతలో ఏప్రిల్ నెలాఖరు వరకు మిగిలిన రైతుల ఖాతాల్లో రూ.2,760 కోట్లు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు చెల్లింపులు మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.
ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున సాయం అందిస్తున్న ప్రభుత్వం, మొత్తం పథకం అమలుకు దాదాపు రూ.9 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. నిధుల పరిమితి కారణంగా ఈసారి మూడు దశల్లో డబ్బులు విడుదల చేసే విధానాన్ని అనుసరిస్తోంది.
