×
Ad

Cold Waves : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ.. నాలుగు రోజులు ఆ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త..

Cold Waves : తెలంగాణలో చలి పులి వణికిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా చలి అధికంగా ఉంటోంది.

Cold Waves

Cold Waves : తెలంగాణలో చలి పులి వణికిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా చలి అధికంగా ఉంటోంది. దీంతో రాత్రి వేళల్లో, ఉదయం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చే సమయాల్లో చలి నుంచి రక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, వాతావరణ శాఖ మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులు చలి తీవ్ర ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

Also Read: Indian Railway : రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త.. ఇకపై చివరి నిమిషం వరకు ఎదురు చూడాల్సిన పనిలేదు..

మరో నాలుగు రోజులు రాష్ట్రంలో చలితీవ్రత కొనసాగనుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుండి 7 డిగ్రీలకు పడిపోతాయని అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో పులి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఊష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వాహనాల రాకపోకలకు, ప్రజల రోజువారీ జీవనానికి అంతరాయం కలిగిస్తోంది.

బుధవారం ఉదయం కోహీర్‌లో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా మెదక్‌ జిల్లాలోని దామరంచలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఇక సిద్దిపేట జిల్లాలోని పోతిరెడ్డి పేటలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఏటా రాష్ట్రంలోని కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ ఈసారి సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

గతంతో పోలిస్తే నగరంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో 7 నుండి 9 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే పదిరోజులుగా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ కనిపిస్తోంది. అయితే రాబోయే నాలుగు రోజులు మాత్రం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలాఉంటే చలి తీవ్రత పెరిగితే వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువ ఇబ్బందిపడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా చలి ప్రభావం..
దేశ వ్యాప్తంగా చలి గజగజ వణికిస్తోంది. హిమాలయాల నుంచి వీస్తున్న అతిశీతల గాలులతో ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు చలితో ప్రజలు వణికిపోతున్నారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రానున్న 48గంటల్లో ఈ చలి తీవ్రత మరింత పెరుగుతుందని, ముఖ్యంగా కశ్మీర్ లోయలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోగా.. హిమాచల్, ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను వణికిస్తోంది. పంజాబ్ హర్యానాలో తేమతో కూడిన చల్లని గాలుల వల్ల విజిబిలిటీ సున్నాకి పడిపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతాన్ని అటు చలి, ఇటు కాలుష్యం రెండు వైపుల నుండి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు.. పర్వత ప్రాంతాలైన కులు, లాహౌల్-స్పితి, చమోలిలో భారీగా మంచు కురిసే అవకాశం ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ టూరిజం హెచ్చరించింది.