Cold Wave Alert
Cold Wave Alert : తెలంగాణలో చలి తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రాత్రి, ఉదయం వేళల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలిలో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. 29 జిల్లాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పదేళ్ల రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read : Gold Silver Rates : బంగారం, వెండి.. భవిష్యత్తులో ఏది అత్యుత్తమం.. నిపుణులు ఏం చెప్పారంటే? నేటి ధరలు ఇవే..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు రాత్రిపూట రాష్ట్ర వ్యాప్తంగా 4.5 నుంచి 11.12 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో ఉదయం 8గంటల తరువాతే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాల్లో పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలోని కోహిర్ లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.5డిగ్రీలు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 17.8డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 4.8డిగ్రీలు నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ పదేళ్లలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగిలిన జిల్లాల్లో 10డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాల్లోనూ 11.2 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్న పిల్లలు, వృద్ధులు రాత్రి, ఉదయం వేళ్లలో బయటకు రావొద్దని వైద్య నిపుణులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా చలి తీవ్రతను తట్టుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో కూడా ఈ ఏడాదిలోనే అత్యంత చలితీవ్రత నమోదైంది. నగరంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా ఉన్నప్పటికీ.. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఇంకా తక్కువగా ఉంది. శేరిలింగంపల్లిలో 7.8డిగ్రీలు, మల్కాజిగిరి ప్రాంతంలో 8.3 డిగ్రీలు, రాజేంద్ర నగర్ ప్రాంతంలో 9.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
COLDEST MORNING OF THIS SEASON FOR TELANGANA 🥶🥶
Sangareddy recorded 4.5°C, the lowest of this season so far, Hyderabad City recorded lowest temp of 6.3°C matching Dec 11 coldwave 🥶 pic.twitter.com/5AiI4fxcZ9
— Telangana Weatherman (@balaji25_t) December 20, 2025