Rain Alert
Heavy Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో తీరాన్ని దాటిన తీవ్ర అల్పపీడనం మరింత ముందుకు కదిలింది. ప్రస్తుతం మధ్య ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుంది. మరోవైపు తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. (Heavy Rain Alert) ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: Smita Sabharwal : స్మితా సబర్వాల్ ఆరు నెలలు లీవ్.. కారణం ఇదే.. ఆసక్తికర ట్వీట్..
బుధ, గురువారాల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగటున 5.08 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి.
మరో రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో వాతావరణ శాఖ అధికారులు మరో బాంబు పేల్చారు. బంగాళాఖాతంలో త్వరలో మరో మూడు అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయని చెప్పారు.
రానున్న రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 2 నాటికి అల్పపీడనం ప్రభావంపై స్పష్టత వస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉన్నతాధికారి నాగరత్న తెలిపారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావం ఒకేసారి ప్రభావం చూపడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. అయితే, సెప్టెంబర్ నెలలోనే మూడు అల్పపీడనాలు వరుసగా ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
కామారెడ్డి జిల్లాపై మినీ క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. 10రోజులుగా అక్కడ మేఘాలు కేంద్రీకృతమయ్యాయని, రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.