Minister Gangula Kamalakar : తెలంగాణ సీఎం కేసీఆర్ నేషనల్ పార్టీపై మంత్రి గంగుల కమలాకర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశానికి కేసీఆర్ సారథ్యం అవసరం అన్నారు. కేసీఆర్ కారణజన్ముడు అన్న మంత్రి గంగుల.. ఆయన తెలివితేటలు దేశానికి అవసరం అన్నారు. బీఆర్ఎస్ తీసుకురావాలని కోరామని, భారత దేశానికి దశ దిశ చూపించాలని తామంతా కేసీఆర్ ను డిమాండ్ చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
కేసీఆర్ ఎజెండా ప్రకటిస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసొస్తాయని మంత్రి గంగుల అన్నారు. అంతేకాదు ఏపీ సీఎం జగన్ కూడా కలిసి రావాల్సిందేనని మంత్రి గంగుల అన్నారు. ఏపీ ప్రజలు కోరుకుంటే జగన్ కూడా కలిసొస్తారని నమ్ముతున్నట్టు మంత్రి గంగుల చెప్పారు.
మరోవైపు జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో చర్చించారు. బీజేపీని గద్దె దించేందుకు కలిసి రావాలని ఆయా పార్టీల నేతలను కోరారు. కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో చర్చించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి.. కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుపై కుమారస్వామికి వివరించారు కేసీఆర్. జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఇరువురూ చర్చించారు. జాతీయ స్థాయిలో కలిసిరావాలని కుమారస్వామిని కేసీఆర్ కోరినట్లు సమాచారం. అంతకుముందు ప్రగతిభవన్ కు వచ్చిన కుమారస్వామికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు కేసీఆర్. పుష్పగుచ్చం ఇచ్చి దగ్గరుండి మరీ ఇంట్లోకి తీసుకెళ్లారు.