Harish Rao : ప్రభాకర్ రెడ్డి గన్‌మెన్ అలర్ట్‌గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది, సర్జరీ తర్వాతే తెలుస్తుంది- మంత్రి హరీశ్ రావు

ఎంపీ ప్రభాకర్ చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు, కత్తిపోట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప. ఇలాంటి దాడులు మంచిది కాదు. Harish Rao

Harish Rao On Kotha Prabhakar Reddy Incident

Harish Rao On Kotha Prabhakar Reddy Incident : మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు మంత్రి హరీశ్ రావు. ఇది చాలా దురదృష్టకరం అన్నారాయన. రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు, కత్తిపోట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు హరీశ్ రావు. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప.. ఇలాంటి దాడులు మంచిది కాదని హితవు పలికారు మంత్రి హరీశ్ రావు. కాగా, కత్తితో దాడి సమయంలో ప్రభాకర్ రెడ్డి గన్ మెన్ కనుక అలర్ట్ గా ఉండకపోయుంటే.. ఊహించని ఘోరం జరిగి ఉండేదని మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆయనకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారని హరీశ్ రావు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు సర్జరీ చేస్తున్నారని, సర్జరీ తర్వాత డాక్టర్లతో మాట్లాడి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

గన్ మెన్ అప్రమత్తంగా లేకుంటే..
”దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలంలో మూడు గ్రామాల్లో ప్రచారం చేశారు. సూరంప్లలి గ్రామంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని కారు ఎక్కుతున్న క్రమంలో రాజు అనే వ్యక్తి ఎంపీని కత్తితో పొడిచాడు. అదృష్టం ఏంటంటే.. కత్తితో పొడుస్తున్న సమయంలో ప్రభాకర్ రెడ్డి పక్కనే ఉన్న గన్ మెన్.. దుండగుడి చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగేశాడు. ఆ గన్ మెన్ అలర్ట్ గా ఉండటంతో కత్తి కొన్ని ఇంచులు మాత్రమే కడుపులోకి పోయింది. నిజంగా గన్ మెన్ కానీ అక్కడ అలర్ట్ గా ఉండకపోయుంటే అది ఇంకా ఎన్ని కత్తిపోట్లకు దారితీసునో. కత్తి ఎంత లోతుగా దిగేదో మనం ఊహించలేము.

Also Read : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. హుటాహుటీన ఆస్పత్రికి తరలింపు

సర్జరీ అవసరం ఉందన్న డాక్టర్లు..
ఈ దాడిలో గన్ మెన్ చేతికి కూడా గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన గన్ మెన్.. పొడుస్తున్న చేతిని ఆపే ప్రయత్నం చేశాడు. కొత్త ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. రక్తస్రావం తీవ్రంగా ఉందని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. వెంటనే ఎంపీని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్లు ఆయనను పరిశీలించారు. సి.టి స్కాన్ చేశారు. కడుపులో రక్తస్రావం జరిగి రక్తం వివిధ ప్రాంతాల్లో చేరుకోవడాన్ని డాక్టర్లు గమనించారు. రక్తస్రావం ఇంకా జరుగుతుందా? గాయం లోతు ఎంత? ఇవన్నీ చూడటం కోసం సర్జరీ అవసరం ఉందని డాక్టర్లు తెలిపారు.

ప్రభాకర్ రెడ్డిని ఆపరేషన్ థియేటర్ కు షిఫ్ట్ చేశారు. సర్జరీ పూర్తయ్యాక డాక్టర్లు పూర్తి వివరాలు చెబుతారు. ఆయనకు ప్రాణహాని లేదని డాక్టర్లు తెలిపారు. 2 గంటల పాటు సర్జరీ ఉంటుందన్నారు. శస్త్రచికిత్స తర్వాత డాక్టర్లతో మాట్లాడి మీకు పూర్తి వివరాలు వెల్లడిస్తాం.

దాడులు మంచిది కాదు..
ఇది చాలా దురదృష్టకరం. మా ఎంపీ ప్రభాకర్ చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. గత పదేళ్లుగా మెదక్ ఎంపీగా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. మృదుస్వభావి. సౌమ్యుడు. ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు. ఆయనపై దాడిని ఊహించుకోలేకపోతున్నాం. నన్ను కాపాడండి అని నాతో ఫోన్ లో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు, కత్తిపోట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప. ఇలాంటి దాడులు మంచిది కాదు” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Also Read : హత్యా రాజకీయాలు వద్దు, మా సహనాన్ని పరీక్షించొద్దు- ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్