Harish Rao On SC Classification
Harish Rao On SC Classification : ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎస్సీ వర్గీకరణ కోసం రెండు సార్లు కేంద్రానికి తీర్మానం చేసి పంపించామన్నారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో ఎస్సీ వర్గీకరణపై తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణకు వస్తున్న మోదీ దీనిపై సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే రాష్ట్రానికి రావాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మాదిగలపై మోదీకి చిత్తశుద్ది లేదని విమర్శించారు హరీశ్ రావు. హైదరాబాద్ ఇందిరా పార్కులో ఎమ్మార్పీఎస్ పబ్లిక్ మీటింగ్ లో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా మోదీ మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తీర్మానం ప్రతిని ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరితో మోడీకి ఇచ్చామని తెలిపారు. కానీ మోడీ పట్టించుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మన పార్టీ(బీఆర్ఎస్) కీలక పాత్ర పోషిస్తుందన్న హరీశ్ రావు.. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని స్పష్టం చేశారు.
Also Read : సీపీఎం నేతలతో కాంగ్రెస్ బుజ్జగింపులు.. తమ్మినేనికి భట్టి విక్రమార్క ఫోన్, పోటీపై పునరాలోచన చేయాలని విన్నపం
తెలంగాణ రాగానే కొంతమంది పదవులు వదిలేసి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళారు, కానీ కేసీఆర్ అలా కాదన్నారు. 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇవ్వటం అది కూడా అర్హులకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు మంత్రి హరీశ్ రావు.
MRPS యుద్ధభేరిలో మంత్రి హరీశ్ రావు..
”ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. దళితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్త మద్దతు ఇస్తుంది. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేయాల్సిందే. దళితులకు సీఎం కేసీఆర్ సమన్యాయం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల మీద ఎంత ఖర్చు పెట్టామో ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఎమ్మెల్యేలందరికీ పెన్ డ్రైవ్ ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం మాది.
Also Read : నేడే బీజేపీ నాలుగో జాబితా విడుదల? జనసేనకు కేటాయించే ఆ 9 సీట్లపై ఉత్కంఠ
గతంలో లెక్కలు దాచేవారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కల వివరాలను పెన్ డ్రైవ్ లో నమోదు చేసి మరీ ఇచ్చారు. మొత్తం జనాభా ప్రాతిపదికన ఎస్టీల కోసం ఎంత బడ్జెట్ పెట్టాం? ఎంత ఖర్చు పెట్టాం? ఎక్కడక్కడ ఖర్చు పెట్టాం? ప్రతి రూపాయితో సహా అందరికీ వివరాలు అందించిన ప్రభుత్వం మాది”.