Ministe Indra karan Reddy
Yasangi Crop : బీజేపీ నాయకులు అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ వాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులను కోరారు. బుధవారం ఆయన నిర్మల్ లో విలేకరులతో మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు యాసంగిలో రైతులు వరి ధాన్యం పండించ వద్దని విజ్ఞప్తి చేశారు. వరికి బదులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను వేయాలని సూచించారు. ఓ వైపున యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పుతుంటే… రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం వరి ధాన్యం కోనుగోలు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని, ఆయన చెప్పే మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.
Also Read : AP Covid Cases Update : ఏపీలో కొత్తగా 184 కోవిడ్ కేసులు
బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే సాగు చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. నూతన వ్యవసాయిక చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన 750 మది రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. సాగు చట్టాల రద్దుపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేసినా… చర్చ జరపకుండానే నిమిషాల వ్యవధిలో బిల్లుకు ఆమోదం తెలిపారని బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
సాగు చట్టాలను నిరసిస్తూ పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సీయం కేసీఆర్ మానవతా దృక్పథంతో ప్రతి కుటుంబానికి రూ.మూడు లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారన్నారు. 750 మంది రైతు కుటుంబాలకు రూ.22.50 కోట్లు అందజేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.