minister KTR comments on dk shivakumar letter to foxconn company
Minister KTR: కాంగ్రెస్ అధికారంలోని వస్తే హైదరబాద్ నుంచి పరిశ్రమలు బెంగళూరుకు తరలిపోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్ కంపెనీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఫాక్స్‌కాన్ కంపెనీకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గత నెలలో రాశాడరని వెల్లడించారు.
”ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్టోబర్ 25నాడు లేఖ రాశారు. నాలుగేళ్లు వెంటపడి, ఎంతో కష్టపడి మనం ఈ కంపెనీ తీసుకొచ్చాం. కొంగలకలాన్ లో ఫాక్స్‌కాన్ కంపెనీ రెండస్తుల నిర్మాణం పూర్తయింది. కొద్ది రోజుల్లోనే కంపెనీ ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో శివకుమార్ లేఖ రాశారు. సరే తమ రాష్టానికి పరిశ్రమలు ఆశపడటంలో తప్పేంలేదు. కానీ లేఖలో ఆయన మరో విషయం కూడా ప్రస్తావించారు. త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం రాబోతోందని.. హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ కంపెనీలను బెంగళూరుకు మార్చేస్తామని రాశారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నం. కేసిఆర్ లేకపోయినా, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే జరిగేది ఇదే. ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ కంపెనీలన్ని తీసుకెళ్తారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలకు బెంగుళూరు అడ్డాగా మారింది. బెంగళూరులో టిక్కెట్ల కేటాయింపు, డబ్బులు ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో డబ్బులు పట్టుబడుతున్నాయి.
ఏ ఒక్క రంగాన్ని మేము విస్మరించలేదు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతులు పెరిగాయి. 24 వేల కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. లక్షల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం. హైదరాబాద్ లో అభివృద్ది అందరికీ కనిపిస్తుంది, విపక్షాలకు మాత్రం కనబడటం లేదు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు శత్రువులు అందరూ ఏకమవుతున్నారు. 2014, 2018 ఎవరినీ మేము నమ్ముకోలేదు, ప్రజలను మాత్రమే నమ్ముకున్నాం. 2023 లోనూ ప్రజలనే నమ్ముకుంటున్నాం. సినిమా పరిభాషలో చెప్పాలంటే.. కేసీఆర్ సింహం లాంటి వారు, సింగిల్ గానే వస్తారు. బీఆర్ఎస్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ది ఆగిపోతుంద”ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read: కాంగ్రెస్ నాయకులు ఎంతమంది గోడలు కూల్చి కబ్జాలు చేశారో మా దగ్గర ఆధారాలున్నాయి
ఢిల్లీ దొరల ముందు తలదించుకోం
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. ”మన హైకోర్టు మనకిచ్చేందుకు ఐదేళ్లు సతాయించిన వ్యక్తి మోదీ. చావనన్నా చస్తాం. ఢిల్లీ దొరల ముందు తలదించుకోం. మళ్లీ మా సీఎం కేసీఆర్ అని చెబుతున్నాం. మీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించే దమ్ము కాంగ్రెస్, బీజేపీకి ఉందా? సీఎం పదవి కోసం కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు పదవుల మీద తప్ప, ప్రజల మీద ప్రేమ లేదు. పైసలు పంచుతూ రూ.50 లక్షలతో పట్టుబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి” అని అన్నారు.
Also Read: మైనార్టీ ఓట్ల చీలికకు మజ్లిస్ వ్యూహం.. మిత్రపక్షం గెలుపు కోసం ఎంఐఎం అధినేత ఎత్తుగడ
కేటీఆర్ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్
డీకే శివకుమార్ లేఖ పేరుతో తమ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ అన్నారు. ”కేటీఆర్ ఫాల్స్ ప్రచారం చేయడంలో నెంబర్ 1. డీకే శివ కుమార్ ఓ కంపెనీకి లేఖ రాశారని తప్పుడు మాటలు చెప్తున్నారు. కాళేశ్వరం ఇష్యుని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. మా వార్ రూమ్ నుంచి డీకేతో మాట్లాడాం. డీకే లెటర్ హెడ్ ని ట్యాంపర్ చేశారని పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయింది. ఫేక్ న్యూస్ తో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని” ఫైర్ అయ్యారు.