దేశవ్యాప్తంగా ఐటీఐఆర్‌ను మూలనపెట్టింది బీజేపీ ప్రభుత్వమే : మంత్రి కేటీఆర్

KTR counter Bandi Sanjay’s letter : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంజయ్ లేఖపై స్పందించిన ఆయన.. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ మూలకు పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు ప్రకటన చేశారని గుర్తు చేశారు.

సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటన గురించి సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. అధికారంలో ఉన్న బెంగళూరు లాంటి పట్టణంలోనూ ఐటీఐఆర్ ఒక అడుగు ముందుకు పోలేదని విమర్శించారు. మరి అక్కడ ఐటిఐఆర్ ప్రాజెక్టు రానందుకు కూడా తమ ప్రభుత్వమే కారణమేనా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులన్ని బండి సంజయ్‌కి ఇస్తామని, ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ము ఉందా అని సవాల్ చేశారు. ఐటీఐఆర్ విషయంలో వెనక్కి పోయిన బీజేపీ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్టు పైన కేంద్రం నుంచి ఒక ప్రకటన చేయించాలని బండి సంజయ్‌కు సూచించారు.

దమ్ముంటే ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్‌కి సమానమైన మరో ప్రాజెక్టుని హైదరాబాద్ నగరానికి తీసుకురాగలరా అని నిలదీశారు. బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని ఎద్దేవా చేశారు. సిగ్గులేకుండా అసత్యాలు, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బయటపడిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు