TRS Working President KTR : ప్రత్యర్ధులకు గట్టిగా సమాధానం చెప్పాలి-కేటీఆర్

ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌లను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉందని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Ktr Trs Working President

TRS Working President KTR :  ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌లను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉందని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం జ‌ల విహార్‌లో జీహెచ్ఎంసీకి   చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌తో కేటీఆర్   విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో తెలంగాణ‌లోని   ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల‌పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ రోజు కొంత మంది నాయకులు ఎగిరెగిరి ప‌డుతున్నారు. టీ – కాంగ్రెస్, టీ – బీజేపీ…. కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా?  మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? అని కేటీఆర్   ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  మిమ్మ‌ల్ని ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ పుణ్య‌మా అని ప‌ద‌వులు రాగానే.. గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు  అని ఎద్దేవా చేశారు. చిల్ల‌ర మాట‌లు మాట్లాడుతున్నారు. వ‌య‌సులో మీ కంటే 20 ఏళ్ళ పెద్ద మ‌నిషిని ప‌ట్టుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారన్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్ల‌ర‌గాళ్లు ఎగిరెగిరి ప‌డుతున్నారు. పేరుకే ఢిల్లీ పార్టీలు కానీ.. చేసేవి మాత్రం చిల్ల‌ర ప‌నులు అని ధ్వ‌జ‌మెత్తారు.

60 ల‌క్ష‌ల పైచిలుకు స‌భ్యుల‌తో టీఆర్ఎస్ పార్టీ బ‌లంగా ఉందని… 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాల‌యాలు క‌ట్టుకున్నామని ఆయన అన్నారు. మొన్న ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌కు భూమిపూజ చేసుకున్నాం. ఇప్పుడు మ‌న ముందు ఏ ఎన్నిక లేదు. హుజూరాబాద్ ఎన్నిక స‌మ‌స్య‌నే కాదని ఆయన చెప్పారు. దాని కోసం సైన్యం ఉంటే స‌రిపోదు. ఇందుకు ఎక్క‌డిక‌క్క‌డ క‌మిటీలు ప‌టిష్టంగా ఉండాలి. జీహెచ్ఎంసీ ప‌రిధిలోకి వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క‌మిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని సూచించారు.

గ్రేట‌ర్ ప‌రిధిలో 4,800 దాకా కాల‌నీ అసోసియేష‌న్‌లు ఉన్నాయి. 1486 నోటిఫైడ్ బ‌స్తీలు ఉన్నాయి. మొత్తం క‌లిపి 6,300 దాకా కాల‌నీలు, బ‌స్తీలు ఉన్నాయి. డివిజ‌న్ల‌తో పాటు వీటికి కూడా క‌మిటీలు వేసుకోవాలని చెప్పారు. సెప్టెంబ‌ర్ 29వ తేదీ లోపు బ‌స్తీ, కాల‌నీ క‌మిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ క‌మిటీలో 15 మందికి త‌గ్గ‌కుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. డివిజ‌న్ స్థాయిలో 150 డివిజ‌న్ క‌మిటీలు వేసుకోవాలి. ఈసారి జిల్లా క‌మిటీలు వేసుకోవాల‌ని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ వెల్ల‌డించారు.