KTR fire on central govt : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంగళం పాడుతుందని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేసీఆర్ కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం 150 ఎకరాల విలువైన భూమి సేకరించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని పేర్కొన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే వరంగల్ తోపాటు తెలంగాణ రాష్ట్రానికి సైతం తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం బీజేపీ ప్రభుత్వానికి లేదని చెప్పారు.
కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్న హైస్పీడ్ ట్రైన్, బుల్లెట్ రైలు విషయంలోనూ రాష్ట్రానికి మొండిచేయే చూపిందని విమర్శించారు. రైల్వేను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూస్తుందని ఆరోపించారు. రైల్వేను ప్రైవేట్ పరం చేయడం జాతి వ్యతిరేక చర్యనేనని పేర్కొన్నారు.