Minister KTR : నాడు చంద్రబాబు.. నేడు చోటా చంద్రబాబు.. వరుస ట్వీట్లతో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్..

మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Minister KTR : నాడు చంద్రబాబు.. నేడు చోటా చంద్రబాబు.. వరుస ట్వీట్లతో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్..

Minister KTR

Updated On : July 12, 2023 / 11:30 AM IST

BRS Leader KTR: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్ (Congress) వర్సెస్ బీఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య పోటాపోటీ నిరసనలకు దారితీశాయి. అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) లో 95శాతం మంది రైతులు మూడు ఎకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే. ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట విద్యుత్ చాలు. మూడు ఎకరాల్లో వ్యవసాయంచేసే రైతుకు మూడు గంటల విద్యుత్ చాలు.. మొత్తంగా ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. రైతులకు 24గంటల విద్యుత్‌ను కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంటే, రైతులను అవమానపర్చేలా రేవంత్ ఎనిమిది గంటల విద్యుత్ చాలు అనడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.

Revanth Reddy : తెలంగాణలో దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఉదయం వరుస ట్వీట్లతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నోట.. రైతులకు ఇది రెండో ప్రమాద హెచ్చరిక.. !! కాంగ్రెస్ వస్తే.. నిన్న ధరణి తీసేస్తం అన్నారు. నేడు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నడు. నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు.. నేడు మూడు పూటలు విద్యుత్ దండగ అంటున్నడు చోటా చంద్రబాబు అంటూ రేవంత్‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Revanth Reddy : 24గంటల ఉచిత విద్యుత్.. పక్కా మోసం- సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

మూడు ఎకరాల రైతుకు మూడు పూటలా కరెంట్ ఎందుకు అనడం ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్న కారు రైతులంటే చిన్నచూపు, సన్నకారు రైతు అంటే సవతి ప్రేమ. నోట్లు తప్ప రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం. అన్నదాత నిండా మునుగుడు పక్కా అంటూ కేటీఆర్ అన్నారు. నాడు  ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోంది. మూడు గంటలతో మూడు ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగమవుతాయి. మళ్లోసారి రాబందు మూడు గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు.

 

తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయమన్న కేటీఆర్.. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా? మూడు గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ? అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నినాదం మూడు పంటలు.. కాంగ్రెస్ విధానం మూడు గంటలు.. బీజేపీ విధానం మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.