Indiramma Towers Application : హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్.. ధరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఎవరైనా ఇలా చేయాల్సిందే..?
Indiramma Towers Application : హైదరాబాద్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కోసం దరఖాస్తుల విషయంపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. ప్రతి ఒక్కరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
- Harish Thanniru
- Published on- July 23, 2026 / 01:42 PM IST
Indiramma Towers
Indiramma Towers Application : పట్టణ ప్రాంతాల్లోని పేద వర్గాల ప్రజలకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పట్టణాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ ను నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, హైదరాబాద్‌లో గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు.. ఇందిరమ్మ టవర్స్‌కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా..? పాత దరఖాస్తులు సరిపోతాయా అనే అంశంపై ఆందోళన నెలకొంది. ఈ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
Also Read : చీరలు కొనివ్వలేదని.. కుక్కర్ తో కొట్టి భర్తను హత్యచేసిన భార్య.. ఆ తర్వాత అసలు డ్రామా స్టార్ట్
గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి.. భూములు, ఇళ్లు తదితర సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొన్ని సమస్యలను సంబంధిత కలెక్టర్లతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. వారి ఆశలకు అనుగుణంగా ఇప్పటికే రెండు విడతల్లో 7లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు.
పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నగర పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ టవర్స్‌లో నిర్మించే ఇళ్ల విలువ భూమి వాటాతో కలిపి రూ.40లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. ఈ ఇళ్లను 10 సంవత్సరాల వరకు విక్రయించకుండా నిబంధనతో రిజిస్ట్రేషన్ చేస్తామని, అయితే వాటిపై బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఇందిరమ్మ టవర్స్ కోసం దరఖాస్తులు మీసేవ కేంద్రాలు, గృహనిర్మాణ శాఖ అధికారిక వెబ్‌సైట్, అలాగే వాట్సాప్ ద్వారా స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అయితే, ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నవారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందే అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
