Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivasa Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలుచేసేందుకు చిత్తశుద్దితో ఉన్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. ఈనెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పూనుకున్నామని చెప్పారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే రెండు హామీలు ప్రజల్లోకి వెళ్లాయని అన్నారు. ప్రజల ఆరోగ్య సంబంధమైన ఆసుపత్రి ఖర్చులను రూ.10లక్షలకు పెంచామని తెలిపారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోకి పాలనను తెచ్చామని పొంగులేటి అన్నారు.
గత ఐదేళ్లుగా స్వరాష్ట్రంలో ప్రజల కలలు కల్లలయ్యాయని, 6 71 లక్షల కోట్ల రూపాయల అప్పును తెలంగాణ నెత్తిన పెట్టారని శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పులు తప్పుకాకపోయినా సరియైన రీతిలో ఆ నిదులను సద్వినియోగం చేయలేదని అన్నారు. కేవలం రాచ ఠీవి అనుభవించేందుకే తెలంగాణను వాడుకున్నారని పొంగులేటి కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. విలాసాలు, భోగాలు అనుభవించి ప్రజల సమస్యలను పక్కన పెట్టారని, కాంగ్రెస్ హయాంలో ప్రజల కష్ట, సుఖాలలో పాలుపంచుకుంటామని అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణకు సమకూర్చిన ఆస్తులు ప్రగతి భవన్, కూల్చికట్టిన సెక్రటేరియట్లు మాత్రమేనని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Also Read : Siddaramaiah : సిద్ధరామయ్యే మా రాముడు…కర్ణాటక కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ హయాంలో ప్రజలకోసం చిత్తశుద్దితో పనిచేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులం కృషి చేస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కిందిస్థాయిలో ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వ పథకాలు అందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయం అన్నారు. ప్రజాపాలనలో ప్రజలు ఇచ్చే ప్రతి అప్లికేషన్ కంప్యూటరైజ్ చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరిన కోర్కెలన్నింటినీ పూర్తి చేస్తామని అన్నారు. ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండానే ప్రజాపాలన కార్యక్రమం పూర్తి చేస్తున్నామని, ప్రజల గుమ్మం ముందుకే పథకాలు వస్తాయని, పేదోళ్లకే ప్రాధాన్యత ముందుగా ఉంటుందని పొంగులేటి స్పష్టం చేశారు.