Indiramma houses
Indiramma Housing Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ఒకటి. 2024లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే గొప్ప లక్ష్యంతో రేవంత్ సర్కార్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. 119 నియోజకవర్గాల్లో 4లక్షల 50వేల గృహ నిర్మాణాలకు గాను 22వేల 500 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది ప్రభుత్వం.
కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. ఒక రకంగా వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఆగస్టు 1వ తేదీ నాటికి ముగ్గు పోసి ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టకపోతే.. లబ్దిదారుల ఇళ్ల మంజూరు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని లబ్దిదారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ లో మంత్రి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ హెచ్చరిక జారీ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. భూమి లేని వారికి ఉచితంగా భూమితో పాటు ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. ఈ ఆర్థిక సాయం నాలుగు విడతలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతుంది. నిర్మాణ పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన చాలా మంది లబ్ధిదారులు ఇప్పటికీ ముగ్గు కూడా పోయలేదని, నిర్మాణాలు ప్రారంభించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వారందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.