×
Ad

Hilt Policy: హైదరాబాద్ మరో ఢిల్లీ కావొద్దనే..! హిల్ట్ పాలసీపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ..

ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ ధారాదత్తం చేసింది. అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చితే వారికి ఇచ్చే ఆలోచన చేసింది.

Hilt Policy: హిల్ట్ పాలసీపై బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ మరో ఢిల్లీ కావొద్దనే పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసినప్పుడు బీజేపీ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

”ఒక దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాలసీలను అడ్డుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనిని వ్యతిరేకించాలనే మీ విధానం కరెక్ట్ కాదు. హైదరాబాద్ లో మున్సిపాలిటీల విలీనం కొత్త కాదు. రాష్ట్ర అభివృద్ధి, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి విలీనాలు జరిగాయి. మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలను దృష్టిలో ఉంచుకుంటాం. మేము చేసే ప్రతి ఆలోచన ప్రజలు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని ఉంటుంది.

హిల్ట్ పాలసీ జీవోపై మరోసారి ప్రజలకు స్పష్టత ఇస్తున్నా. ఆ జీవోకు సంబంధించి పట్టాలు ఉండి సొంత భూములకు సంబంధించి కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ ధారాదత్తం చేసింది. అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చితే వారికి ఇచ్చే ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాలుష్య నివారణ మా ప్రధానమైన ఆలోచన” అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

”హిల్ట్‌ పాలసీపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. పట్టాలు ఉండి.. సొంత భూములున్న వారికే కన్వర్షన్‌ ఫీజు పెట్టాము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీవో ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను పారిశ్రామికవేత్తలకు ఇచ్చే జీవో తీసుకొచ్చారు. ప్రభుత్వ భూమిపై హక్కును బదిలీ చేస్తున్నామనేది అవాస్తవం. హిల్ట్‌ పాలసీలో ఎస్‌ఆర్‌వో రేటు కంటే ఎక్కువ ఫీజు నిర్ణయించాం’’ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరణ ఇచ్చారు.

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9వేల 292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని, దీని వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం వాదన ఇలా ఉంటే.. ప్రతిపక్షాల వెర్షన్ మరోలా ఉంది. భూమిని తక్కువ ధరకు అమ్మేస్తున్నారని, 5లక్షల కోట్ల స్కామ్‌ జరుగుతోందని బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అంతేకాదు దీనిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశాయి.

Also Read: ఐటీ రంగాన్ని భయపెడుతున్న హెచ్ఐవీ.. పెరుగుతున్న కేసులు.. ఆ తరువాత రంగం ఏదో తెలుసా..? ఏపీ టాప్‌లో..