Uttam Kumar Reddy: మీడియాతో చిట్ చాట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం కూలినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని హరీశ్ పై ధ్వజమెత్తారు. హరీశ్ రావు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. గోబెల్స్ హరీశ్ రావు అతి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్, హరీశ్ రావు తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేసి కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు.
”విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కమిషన్.. కాళేశ్వరంలో జరిగిన నిర్వాకం బయట పెట్టాయి. ఐదేళ్లలో కాళేశ్వరం 165 టీఎంసీలు, మరోసారి 65 టీఎంసీలు సముద్రంలోకి వదిలేసింది నిజం కాదా? కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేసి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారు. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్, హరీశ్. కృష్ణా నదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? రాష్ట్రాన్ని దివాళా తీయించారు.
90 టీఎంసీల కంటే మేము ఎక్కడా తక్కువ అడగలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటికీ పర్యావరణ అనుమతులు లేవు. డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు తట్టెడు మట్టి తీయలేదు. పాలమూరు ప్రాజెక్ట్ ను పూర్తి చేయకుండా పదేళ్లు పక్కన పెట్టారు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క చుక్క నీరైనా ఇచ్చారా? పదేళ్లలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ను ఎందుకు పూర్తి చేయలేదు. హరీశ్ కు సిగ్గుండాలి. 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ కృష్ణా బోర్డుకు 2020 జనవరి 9న సంతకం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలను మా ప్రభుత్వం అడ్డుకుంది. కోమటిరెడ్డికి పేరు వస్తుందని బ్రాహ్మణ వెల్లూరు ప్రాజెక్ట్ ను కేసీఆర్ పక్కన పెట్టారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిందే కాంగ్రెస్” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.