రంగంలోకి దిగుతా, గ్రామసభలు నిర్వహిస్తాం.. ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా ఇదే..: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
అప్పట్లో ఎంవోయూల్లో వంట మనుషులు సంతకాలు పెట్టారని చెప్పారు.
KCR: ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా రియల్ ఎస్టేట్ దందానేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఫార్మాసిటీ కోసమే వాడతామన్న నిబంధనతో భూసేకరణ చేశామని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఇవాళ బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గంతో కేసీఆర్ సమావేశమై చర్చించారు.
అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు విశాఖలో బిజినెస్ మీటింగులు పెట్టారు. అప్పట్లో ఎంవోయూల్లో వంట మనుషులు సంతకాలు పెట్టారు. అప్పట్లో విశాఖ ఎంవోయూలన్నీ నిజమైతే లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి కదా? మేము బిజినెస్ మీటింగులు పెట్టలేదు మంచి పాలసీలతోనే ఆకర్షించాం.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం. జంట నగరాల్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నా అడిగే దిక్కేలేదు. తెలంగాణలో ఏం జరుగుతోంది?
తెలంగాణ మొత్తానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చింది. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తున్నారు. కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతలపై మనకు నష్టం జరుగుతుంటే చప్పుడే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? నిద్రపోతోందా? నేనే స్వయంగా రంగంలోకి దిగుతా. ఆయా జిల్లాల నాయకులతో సమావేశమవుతా. కచ్చితంగా పెద్ద ఎత్తున గ్రామసభలు పెడతాం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం.
పాలమూరు జిల్లాలో చెరువుల లెక్కలను తీసి కేంద్ర సర్కారుకు సమర్పించాం. అయితే, చంద్రబాబు నాయుడి మాటలు విని కేంద్ర సర్కారు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి శనిలా దాపురించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడతాం. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం” అని అన్నారు.
