SLBC Rescue Operation : ఎస్ఎల్ బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. అత్యున్నత నైపుణ్యం ఉన్న వారితో రెస్క్యూ కొనసాగిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరో రెండురోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామన్నారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిపుణులతో పరిస్థితులను సమీక్షిస్తున్నామని చెప్పారు. టన్నెల్ లోపల 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయిందని, రెస్క్యూ ఆపరేషన్ కు బురదే ఆటంకంగా మారిందని ఆయన తెలిపారు.
”ఇప్పుడు పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. డీవాటరింగ్ చేసి కొలాప్స్ అయిన టన్నెల్ బోరింగ్ మిషన్ ను గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్లు కలిసి లోపలికి వెళ్లి 8 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సీరియస్ గా ప్రయత్నం చేయబోతున్నాం. ఈ మొత్తం ఆపరేషన్ ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని నమ్ముతున్నాం” అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో క్షణక్షణం ఉత్కంఠ..
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. రోజులు గడుస్తున్నా కార్మికుల ఆచూకీ దొరకలేదు. టన్నెల్ లో భారీగా వరద నీరు, బురద పేరుకుపోయింది. దాదాపు 8 అడుగుల మేర నీరు నిలిచి ఉంది. నీటిని, బురదను తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ ను సిద్ధం చేస్తున్నారు. బోరింగ్ మిషనరీ తొలగిస్తేనే రెస్క్యూ టీమ్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
Also Read : సీఎం రేవంత్ సంచలన కామెంట్స్.. ఆ మూడు అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ నోరెత్తడం లేదే..!?
టన్నెల్ లోపలికి వెళ్లి వచ్చిన ర్యాట్ టీమ్..
నిన్న రాత్రి ఒకసారి ర్యాట్ హోల్ టీమ్ టన్నెల్ లోపలికి వెళ్లి అక్కడున్న పరిస్థితులు చూసి వచ్చారు. ఏదైతే 40 మీట్లరు ఉందో అదే చాలా కీలకంగా భావిస్తున్నారు. ఆ 40 మీటర్లలో పేరుకుపోయిన నీటిని, బురదను తొలగిస్తే లోపలికి వెళ్లేందుకు వీలు అవుతుందని చెబుతున్నారు. అందుకే, ఇవాళ ఆ మెషినరీతో నీరు, బురద తొలగింపు పనులు చేస్తున్నారు.
8 అడుగుల మేర బురద, నీటితో ఆ ప్రాంతమంతా నిండిపోయి లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉంది. కార్మికులంతా ఆ లోపల చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా నీరు, బురద తొలగించి లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకే శ్రమిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.