Cm Revanth Reddy : సీఎం రేవంత్ సంచలన కామెంట్స్.. ఆ మూడు అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ నోరెత్తడం లేదే..!?
సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.

Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ టార్గెట్ గా చెలరేగిపోయారు. ఇటీవల చోటు చేసుకున్న మూడు మరణాలను కేటీఆర్ కు ముడిపెడుతూ హాట్ కామెంట్ చేశారు. ఇటీవల జరిగిన మూడు అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ నోరెత్తడం లేదే అని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ అనుమాదాస్ప మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? విచారణ కోరతారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో ఈ సంచలన కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయని సీఎం రేవంత్ అన్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన రాజలింగ మూర్తి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని సీఎం రేవంత్ నిలదీశారు. ఈ మరణాలపై ఫిర్యాదులు వస్తే దర్యాఫ్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్.. డ్రగ్స్ కేసు త్వరలోనే విచారణకు రాబోతుందని తెలిపారు.
కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు విచారణ కోరడం లేదు?
”కొన్ని రోజులుగా పలువురు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. ముందు సంజీవ రెడ్డి, ఆ తర్వాత రాజలింగ మూర్తి, రీసెంట్ గా నిర్మాత కేదార్ చనిపోయారు. కేసులతో సంబంధం ఉన్న ఈ ముగ్గురు వరుసగా చనిపోవడం వెనుకన్న మిస్టరీ ఏంటి? ఈ మిస్టీరియస్ మరణాలపై ఆయన ఎందుకు స్పందించలేదు. విచారణ ఎందుకు కోరడం లేదు. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుడు కేదార్ కేటీఆర్ కు వ్యాపార భాగస్వామి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
”కేదార్ మృతదేహం ఇండియాకు రానుంది. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లోనే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరు? కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులు కేసీఆర్ పక్కన పెట్టారు. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయి. ఉపఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడూ ఉంది. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎక్కడుంది? పోటీలో లేని వారు మాట్లాడుతున్నారు.
అధ్యక్షుడు ఎవరైనా బీజేపీతోనే పోటీ. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పని చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్రమంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారు.
మెట్రోను కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కిషన్ రెడ్డి. నేను ప్రధానికి ఇచ్చిన ఐదు విజ్ఞప్తులను సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్ లదే. నా వంతుగా నేను చేయవలసింది అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ళ సొంతమే చేసుకోవచ్చు. బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి సన్మానం కూడా చేస్తా. హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, జైపాల్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్ట్ మానిటరింగ్ చేస్తుంది.
బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకునే ప్లాన్..!
సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఫార్ములా ఈ, గొర్రెల పంపిణీ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయింది. కానీ, చర్యలు ఎందుకు తీసుకోలేదు. రాత్రికి రాత్రి మేము ఎవరినీ అరెస్ట్ చెయ్యం. అది మా విధానం కాదు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ జరుగుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై మా దృష్టి ఉంది. దాని ప్రచారంపై లేదు.