Uttam Kumar Reddy Representative Image (Image Credit To Original Source)
Uttam Kumar Reddy: ప్రాజెక్టులు, నదీ జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. నదీ జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్రకు నీళ్లు పంపి తెలంగాణ రైతులకు మరణశాసనం రాశారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పెట్టిన శ్రద్ధ పాలమూరుపై పెట్టలేదన్నారు.
”299 టీఎంసీలకు ఒప్పుకుని బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు మరణశాసనం రాశారు. తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో 783 టీఎంసిలు ఇవ్వాలని వాదనలు వినిపిస్తున్నాం. దాదాపు 73 శాతానికి పైగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ కు 83వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. పాలమూరు, రంగారెడ్డిలో మట్టి, కాంక్రీట్ పనులు మిగిలున్నాయి. మూడేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ పనుల్లో 35శాతం మాత్రమే అయ్యాయి.
కుర్చీ వేసుకుని కూసుంటా అని కేసీఆర్ అన్నారు. కుర్చీ ఎక్కడ పోయిందో, కేసీఆర్ ఎక్కడికి వెళ్ళారో? మూడేళ్లలో పూర్తి చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు 41వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. గోదావరి బేసిన్ లో లక్షా 20వేల కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క టీఎంసీని అదనంగా పెంచారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో టీఎంసీలను తగ్గించారు.
కృష్ణా జలాల్లో 72 శాతం వాటా కావాలని వాదనలు వినిపిస్తున్నాం..
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు త్వరలో రాబోతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలకు నేను హాజరవుతున్నా. క్రష్ణా నదీ జలాల్లో 72 శాతం నీటి కేటాయింపులు తెలంగాణకు వస్తాయని నేను భావిస్తున్నా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణకు అత్యంత కీలకం. 814 టీఎంసీల కృష్ణా నీళ్లు తెలంగాణ, ఏపీకి కేటాయించాలి. తెలంగాణకు కృష్ణా జలాల్లో 72 శాతం వాటా కావాలని వాదనలు వినిపిస్తున్నాం.
ఉమ్మడి ఏపీలో కేటాయించిన 45 టీఎంసీల నీళ్లనే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించారు. గోబెల్స్ ప్రచారాన్ని బీఆర్ఎస్ మించిపోయింది. 2016లో అపెక్స్ కౌన్సిల్ కు కేసీఆర్ హాజరై 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 511 టీఎంసీల నీటి కేటాయింపులపై ఒప్పందాలు ఉన్నాయి. తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Also Read: యూట్యూబర్ అన్వేష్‌కు మరో బిగ్ షాక్..! కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌కు వినతి