Komatireddy Raj Gopal Reddy : కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి పదవి విషయంలో నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగనుందని, ఈ దఫాలో తనకు మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా తనకు ఈసారి పదవి దక్కుతుందని ఆయన ధీమాగా ఉన్నారు. అయితే, తనకు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ నాయకులే తనకు పదవి రాకుండా అడ్డుపడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
Also Read : పార్టీ అధిష్టానమే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందా? సీఎం రేవంత్ ఏయే ఇబ్బందులు పడుతున్నారు?
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. హైదరాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి చెబుతున్నారు.. గతంలో 25 ఏళ్లు ఆయన మంత్రిగా పని చేయలేదా? అని ప్రశ్నించారు. ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిలా మారారని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. సమర్థత ఉన్న నాయకులను గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలన్న రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు.
తాను ఏనాడూ మంత్రి పదవి అడ్డుకోలేదన్న రాజగోపాల్ రెడ్డి.. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. చౌటుప్పల్ మండలం వ్యవసాయ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తే దాన్ని బాధ్యతగా భావిస్తానని చెప్పారాయన. యాదాద్రి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఏనాడు మంత్రి పదవి కోసం మాట్లాడలేదని, మంత్రి పదవి కోసం ఏనాడు ఆడుక్కోలేదని చెప్పారు. భారత దేశ క్రికెట్ టీమ్ లో ఇద్దరు అన్నదమ్ములు ఉండగా ఒకే కుటుంబం నుంచి మంత్రివర్గంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తప్పేంటి? అని ఆయన ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులను గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలన్నారు.
Also Read : కంచ భూముల వెనకున్న ఆ బీజేపీ ఎంపీ ఎవరు? రోజుకో మలుపు తిరుగుతున్న భూముల వ్యవహారం
”జానారెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని చెబుతున్నారు. 25 సంవత్సరాలుగా గతంలో ఆయన మంత్రిగా పని చేయలేదా? గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ కి ఇంఛార్జిగా మంత్రికి బాధ్యతలు ఇచ్చారు. కానీ భువనగిరి పార్లమెంట్ కు నన్నెందుకు ఇంఛార్జిగా చేశారు? అధిష్టానం ఇస్తా అంటే కూడా రాష్ట్రంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు నాకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకట్ట వేస్తున్నారు” అని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.