పార్టీ అధిష్టానమే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందా? సీఎం రేవంత్ ఏయే ఇబ్బందులు పడుతున్నారు?
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం చర్యలతో ప్రభుత్వానికి.. ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట.

CM Revanth Reddy
కాంగ్రెస్ హైకమాండ్… రేవంత్ సర్కార్కు తలనొప్పిగా మారిందా? సీఎం రేవంత్ తీసుకునే కీలక నిర్ణయాలకు పార్టీ మద్దతు ఉండడంలేదా? స్వపక్షంలోనే విపక్షంలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తయారైందా? తెలంగాణ సర్కారును ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ అంశమే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందా? అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల నుంచి విన్పిస్తోంది. పార్టీ అధిష్టాన నిర్ణయాలే.. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయంట. ఇంతకీ కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి..? ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులేంటి? వాచ్ దిస్ స్టోరీ..
బయటి వ్యక్తుల కన్నా సొంత వ్యక్తులపై పోరాటం చాలా కష్టం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు ఇదే అతి పెద్ద సవాలుగా మారిందట. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలెన్నింటినైనా తిప్పి కొట్టవచ్చు. కానీ సొంత పార్టీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించి గట్టెక్కాలా అనే దానిపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సతమతమవుతున్నారట. ఏదో ఒకటి, రెండు విషయాల్లోనే కాదు ప్రతీ విషయంలోనూ సొంత పార్టీ నుంచి సపోర్టు లేకపోగా.. ఇబ్బందులు పెట్టేలా నిర్ణయాలు ఉంటుండటంతో ఏం చేయాలో అర్థంకావడం లేదట.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే నిర్ణయాలకు పార్టీ అధిష్టానం సహకారం ఉండటం లేదని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేయడంతో పాటు.. అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యుల్లో పెట్టాలనే డిమాండ్తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది.
Also Read: పొలిటికల్ హీట్ పెంచుతున్న ఇద్దరు శ్రీనులు.. ఎలాగంటే?
ఈ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర రాజకీయ పక్షాల నేతలు వచ్చి మద్దతు ప్రకటించారు. కానీ అదే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట. దీంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధర్నా పొలిటికల్ మైలేజ్ సాధించలేకపోయిందనే టాక్ ప్రభుత్వ వర్గాల్లో విన్పిస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా పార్టీ అధిష్టానం తీరు ప్రభుత్వ పెద్దలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందట.
ఆగమేఘాల మీద ఢిల్లీకి.. అయినప్పటికీ..
ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని..చర్చించేందుకు ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి కబురు పంపింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. ఆగమేఘాల మీద సీఎంతో పాటు ముఖ్యనేతలంతా ఢిల్లీకి వెళ్లారు. ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం ఉంటుందని చెప్పడంతో.. క్యాబినేట్ విస్తరణ కోసం రాజ్ భవన్ కు సైతం సమాచారం ఇచ్చి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారంట. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మరోసారి వాయిదా పడిందని సమాచారం.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో అధిష్టానం వ్యహరిస్తున్న తీరు ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తోందట. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా సచివాలయం వెళ్లి మంత్రుల కమిటీతో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించడం.. గచ్చిబౌలి స్టేడియంలో HCU విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు, ప్రజాసంఘాలతో సమావేశం కావడం ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందికరంగా మారిందట.
ఈ విషయంలో విపక్షాలు ఒక వైపు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఒత్తిడి, కోర్టుల జోక్యం ఒక ఎత్తయితే.. పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టిందట. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం చర్యలతో ప్రభుత్వానికి.. ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఒక్క మాటలో చెప్పాలంటే కాళ్లు, చేతులు కట్టేసిన మాదిరిగా పార్టీ అధిష్టానం చర్యలు ఉంటున్నాయని వారు చెప్తున్నారట. ఇక ముందు కూడా పార్టీ అధిష్టానం చర్యలు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు తప్పవనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.