MLC Kasireddy Narayana Reddy
Kasireddy Narayana Reddy Resigned BRS : ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం కార్యకర్తల ఆలోచన మేరకు పార్టీ వీడానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం 10టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవిని కూడా వీడాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.
త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని చెప్పారు. అయితే కల్వకుర్తి టికెట్ ఇస్తారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అన్నారు. ఎమ్మెల్సీ పదవి ఉన్నా ప్రజలకు నేరుగా చేరువ కాలేకపోతున్నానని చెప్పారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవి వల్ల ప్రజలకు మేలు చేయలేక పోతున్నానని వాపోయారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నానని స్పష్టం చేశారు.
ఆదివారం ఉదయం కసిరెడ్డి నారాయణ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో జూబ్లిహిల్స్ లోని నివాసంలో భేటీ అయ్యారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవితో కలిసి కసిరెడ్డి నారాయణ రెడ్డి రేవంత్ తో సమావేశం అయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి టికెట్ కన్ఫార్మ్ కావడంంతోనే నారాయణ రెడ్డి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని సమాచారం.
కాగా, ఎమ్మాల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కల్వకుర్తి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు మరోసారి అవకాశం కల్పించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య విబేధాలు ఉన్నాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని కసిరెడ్డి నారాయణ రెడ్డి భావించినప్పటికీ అవకాశం దక్కలేదు. ఆ సమయంలో బీఆర్ఎస్ అధిష్టానం కసిరెడ్డికి సర్దిచెప్పి ఎమ్మెల్సీ పదవికి హామీ ఇచ్చింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కసరెడ్డికి ఎమ్మెల్సీకి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు.
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని కసిరెడ్డి భావించినప్పటకీ నిరాశే ఎదురైంది. కల్వకుర్తి టికెట్ దక్కలేదు. దీంతో అధిష్టానం తీరుపై కసిరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇవాళ కసిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన్నట్లు ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్ లో చేరుతానని చెప్పారు.