MLC Kavitha
MLC Kavitha: బీసీ బిల్లు సాధనకోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతికోరి నిరాహారదీక్ష చేస్తాం.. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహారదీక్షకు దిగుతానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబెడ్కర్ విగ్రహ సాధనకోసం నేను 72 గంటలు దీక్ష చేశా.. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చిందని కవిత గుర్తు చేశారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లకోసం పోరాటం చేస్తున్న వారి అజెండా బీసీలకు రాజ్యాధికారం రావడం.. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించుకోవాలని కవిత అన్నారు. 2018 పంచాయతీ రాజ్ సవరణ చట్టాన్ని సవరణ చేస్తూ తెలంగాణ జాగృతి చేసిన డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసిందని చెప్పారు.
తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఒప్పందంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయాలి. గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే మంచి తీర్పు వచ్చింది.
మేము వెళ్లి ధర్నా చేస్తాము ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు.. ఇది ఏమైనా సత్రం భోజనమా..? రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫీషియల్ గా అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకెళ్లాలి. అఖిలపక్షం ఢిల్లీకి రావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయండి. పొన్నం ప్రభాకర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం డ్రామా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే కోర్టులో కేసు వేయాలని కవిత డిమాండ్ చేశారు.
బీజేపీ బీసీ సీఎం అని అంటున్నారు. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ది లేదు. ఆ పార్టీ అధిష్టానం తప్పించుకుంటోంది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా మనకు ఒరిగేది శూన్యమని కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో నేను 72గంటల నిరాహార దీక్ష చేస్తా. ప్రభుత్వ అనుమతికోరి నిరాహారదీక్ష చేస్తాం.. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహారదీక్ష కు దిగుతామని కవిత స్పష్టం చేశారు.