MLC Kavitha
అగ్రవర్ణానికి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, మంత్రి కొండా సురేఖను అవమానించారంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఇందులో పాల్గొన్న కవిత ప్రొఫెసర్ జయశంకర్, పూలే విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. భట్టి విక్రమార్క, కొండా సురేఖను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టి అవమానించారని, ఇది చాలా దౌర్భాగ్యమని చెప్పారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇస్తే అప్పట్లో కూడా దళితుడుకి వినతిపత్రం ఇచ్చారు అని రేవంత్ అవమానించారని కవిత చెప్పారు. అప్పట్లో రేవంత్ రెడ్డి అవమానించినప్పటికీ తాము ఓపిక పట్టామని, ఇప్పుడు సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడు అయిన భట్టిని రేవంత్ అవమానించారని అన్నారు.
మహిళలకు 47 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ అబద్ధాలు చెప్పారని కవిత తెలిపారు. గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ జీవో ఇచ్చారని చెప్పారు. దాన్ని కాంగ్రెస్ వాళ్లు తీసేశారని తెలిపారు. బీసీలకు మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: అయోధ్యలో అపోలో హాస్పిటల్ ప్రారంభించిన ఉపాసన.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో..