Mlc Kavitha : ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చేశారు- సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

ఒక సామాన్య మహిళ తెలంగాణ తల్లికి పూలు పెడదామని అనుకుంటే.. సెక్రటేరియట్ లోపలికి పోనిస్తారా?

Mlc Kavitha : తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ చర్య వల్ల తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందన్నారు. ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లిని సచివాలయం లోపం ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. అవసరం లేకపోయినా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం బయట ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను సైతం దూరం చేశారని ధ్వజమెత్తారు కవిత. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడంపై కవిత తీవ్రంగా స్పందించారు. రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.

‘నిజంగా ఇవాళ తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టేటటువంటి రోజు. వందలాది మంది బిడ్డలను కోల్పోయిన తెలంగాణ తల్లి ఇవాళ జరుగుతున్న ఈ చర్యతో తప్పకుండా బాధపడుతుంది, కన్నీరు పెడుతుంది. ఇవాళ మీరు గమనించవచ్చు. సెక్రటేరియట్ లో రహదారిలో తెలంగాణ తల్లిని ఘనంగా నిలపాలనుకున్నారు కేసీఆర్. ఎందుకంటే 10 మంది ఆ తల్లిని చూస్తే స్ఫూర్తిని పొందుతారు. కానీ, ఇవాళ సెక్రటేరియట్ రహదారిలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి.. తెలంగాణ తల్లిని ఏమో చెరసాల లోపల సెక్రటేరియట్ లోపల పెట్టిన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు.

ఒక సామాన్య మహిళ తెలంగాణ తల్లికి పూలు పెడదామని అనుకుంటే.. సెక్రటేరియట్ లోపలికి పోనిస్తారా? అంటే రాజీవ్ గాంధీ ఏమో రహదారిలో ఉండాలి, తెలంగాణ తల్లేమో చెరసాలలో ఉండాలి. ఇదీ ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. ఇక మూడోవది.. కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి.. ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినది కాదు. అధికారంలో ఉన్నప్పుడు పెట్టింది కాదు’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

 

Also Read : తెలంగాణ తల్లి రూపురేఖలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు