Revanth Reddy: తెలంగాణ తల్లి రూపురేఖలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చినప్పుడు..

Revanth Reddy: తెలంగాణ తల్లి రూపురేఖలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy

Updated On : December 9, 2024 / 11:58 AM IST

CM Revanth Reddy Speech At Assembly: తెలంగాణ తల్లి రూపురేఖలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 9న ప్రకటించారు. అందుకే డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యత ఉంద‌ని రేవంత్ అన్నారు. అధికారికంగా ఇప్పటి వరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదు. ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నాం. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించకపోవడం దురదృష్టక‌ర‌మ‌ని రేవంత్ పేర్కొన్నారు.

Also Read: Telangana Assembly: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. రేవంత్, అదానీ ఫొటోలున్న టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా..? తల్లిలా ఉండాలా..? అని ప్రస్తావన వచ్చినప్పుడు.. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నాం. నాలుగుకోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నాం. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం ఆలోచన అనుకోవడం తప్పు. మధ్య యుగాల చక్రవర్తులు పాలనలా ఇవాళ నడవదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని రేవంత్ పేర్కొన్నారు.

Also Read: మెరుగైన సేవల కోసం ఇన్ని యాప్‌లను తీసుకువచ్చాం: మంత్రి శ్రీధర్ బాబు

ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం. ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దాం. ఇవాళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుందాం. దేవత ఆశీర్వదిస్తుంది.. తల్లి ప్రేమను అందిస్తుంది. ఆ తల్లి అవతరణ ఉత్సవాలను గొప్పగా జరుపుకుందామ‌ని రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా పిలుపునిచ్చారు.