Mohammed Ali Shabbir takes on BRS party over MLAs defections
Mohammed Ali: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
”పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే నవ్వొస్తుంది. గతంలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? శాసనమండలిలో నా ప్రతిపక్ష నేత హోదా మీరు తొలగించలేదా? మా పార్టీ ఎమ్మేల్యే, ఎమ్మెల్సీలను చేర్చుకుంది మీరు కాదా? పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు అనర్హత వేటు గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఖతం అయింది. 11 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఎందుకు? ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి. ఆ భూమిని వేలం వేసి వచ్చిన డబ్బులు రుణమాఫీకి వాడాలి. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఆఫీసే ఎక్కువ. దానికి కూడా మేమే భూమి ఇచ్చాం. తెలంగాణని కేసీఆర్ అంగడి బజారులో పెట్టారు. కేసీఆర్ తెలంగాణని అమ్మకానికి పెట్టార”ని షబ్బీర్ అలీ విమర్శించారు.
Also Read: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఆమ్రపాలికి కీలక పోస్ట్
గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత
నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆఫీసు ముట్టడికి బయల్దేరిన మహిళా కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Also Read: తెలంగాణ రాష్ట్ర గీతంలో మార్పు వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం ఉందా?