Telangana Weather
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో పాటు, వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 22న ఖమ్మం జిల్లాలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 23న నిజామాబాద్ వరకు వ్యాపించగా శనివారం సాయంత్రంకు రాష్ట్రమంతా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిస్సా – పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని కారణంగా రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిస్సా- పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కొమురం భీమ్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Southwest Monsoon : ఖమ్మం జిల్లాను తాకిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులపాటు భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆదివారం మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 55-65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.