Heavy Rains Lash Hyderabad, Southern Districts Of Telangana
Monsoon Heavy Rains : జూలై మొదటివారంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడిన ప్రభావంతో.. దేశంలోని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యూపీ, బీహార్, అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో నేటి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో వరదలు కూడా పోటెత్తుతాయని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో.. ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోసర్తు వర్షం పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా జిల్లాలకు వర్షసూచన చేశారు అధికారులు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, ఉత్తర కర్ణాటక నుంచి సౌరాష్ట్ర వరకు ద్రోణి రెండూ బలహీనపడ్డాయి. అయితే విదర్బ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ చేశారు. ఎంత వర్షం కురిసినా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.