వణికిస్తున్న చలి, జర భద్రం

  • Publish Date - November 12, 2020 / 07:29 AM IST

temperatures fall : చలికాలం ప్రారంభం నుంచే వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి టెంపరేచర్స్ అనూహ్యంగా పడిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలే కరోనా విజృంభిస్తున్న సమయంలో…చలి పెరుగుతుండడంతో వ్యాధులు సైతం విజృంభిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మర్పల్లి మండలంలో కనిష్టంగా 7.1 సెల్సియస్ డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. పగటి పూట ఎండలు దంచి కొడుతున్నా..రాత్రి 7 గంటల నుంచి చలి స్టార్ట్ అవుతోంది. ఉదయం 8 గంటల వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది.



చల్లగాలుల నుంచి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాల అనారోగస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో నిమోనియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, చర్మ వ్యాధుల బారిన ఎక్కువగా పడే ప్రమాదం ఉందని, చలిగాలుల కారణంగా రక్తనాళాలు మూసుకపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.



జలుబు, దగ్గు, జ్వరం ఉంటే..ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా..వైద్యులను సంప్రదించాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా మహమ్మారి రెండో విడత విజృంభిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.