ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్న వారిని ఐ డోంట్ కేర్ అంటున్నారట అధికార పార్టీ ఎంపీ. సీఎం ఎదుటే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ నిరసన గళం వినిపించినా పరిస్థితుల్లో మార్పు రాలేదట. సొంత పార్టీ ఎమ్మెల్యేలే దూరం పెడుతున్నారని గ్రహించిన సదరు ఎంపీ సైతం తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నారట. అంతేకాదు ఓ మంత్రి ఫోన్ చేస్తే పెద్దగా రెస్పాన్డ్ అవడంలేదట. ఇంతకీ ప్రోటోకాల్ ఇష్యూ ఎదుర్కొంటున్న ఆ ఎంపీ ఎవరు? ప్రోటోకాల్ ఇష్యూ వెనకున్న అసలు సమస్యేంటి?
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణను సొంత పార్టీ ఎమ్మెల్యేలే దూరం పెడుతున్నారట. ఎన్నికల సమయంలో వంశీక్రిష్ణ గెలుపు కోసం కష్టపడిన వారంతా ఇప్పుడు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదట. చెన్నూర్, ధర్మపురి, బెల్లంపల్లి నియెజకవర్గాలకు తప్ప..మిగతా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు పెద్దగా ఆహ్వానించడంలేదట. పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభలోనే ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీ గడ్డం వంశీ నిరసన గళం వినిపించినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదట. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ప్యామిలీ నుండి వచ్చిన వంశీక్రిష్ణకు ప్రోటోకాల్ పాటించక పోవడంపై పెద్దపల్లి పార్లమెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట.
ఎంపీ గడ్డం వంశీ తండ్రి వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యే కాగా, ఆయన పెద్దనాన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వంశీ తాత అయిన దివంగత గడ్డం వెంకటస్వామి కూడా ఎంపీగా ఒకప్పుడు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. వెంకటస్వామి వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్, వినోద్, వంశీ క్రిష్ణలకు ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకుంటారనే కారణంతోనే వారికి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారనేది కాక వర్గీయుల మాట.
మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కోసం మంచిర్యాల జిల్లా నుండి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు వివేక్ కూడా పోటీపడుతున్నారు. ప్రేమ్ సాగర్ రావుకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు వివేక్ అండ్ ఫ్యామిలీ లీడర్స్ కు ప్రాధాన్యత లేకుండా పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారనే టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.
ఇక రాజకీయంగా దూకుడు మీదున్న వంశీక్రిష్ణకు ఛాన్స్ ఇస్తే..పార్లమెంట్ రాజకీయలను తన గుప్పిట్లోకి తీసుకుంటారనే కారణంతోనే ఆయన్ని దూరం పెడుతున్నారనేది మరో టాక్. అందుకే ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలకు ఆహ్వనించకపోవడం, కావాలనే ఫ్లెక్సీల్లో ఫోటోలు వేయడంలేదట. ఒకవేళ వేసినా కనిపించి కనిపించనట్లుగా ఫోటోలను ప్రింట్ వేయిస్తుండడంతో..తానేమి తక్కువ కాదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారట వంశీ క్రిష్ణ.
ఓ మంత్రికి, వివేక్ కు మధ్య గ్యాప్
ఇక జిల్లాలో ఓ మంత్రికి వివేక్ కు మధ్య గ్యాప్ ఓ మంత్రికి వివేక్ కు మధ్య గ్యాప్ ఉందట. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యేలంతా కలిసి ఒకే తాటి పైకి వచ్చినట్లుగా కనిపించినా ఇప్పుడు మాత్రం ఎంపీ హోదాలో వంశీని అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వనించడానికి కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టపడడంలేదట.
ప్రోటోకాల్ పాటించక పోవడానికి సదరు మంత్రే కారణమనే అనుమానాలు ఎంపీ వర్గీయుల నుండి వ్యక్తమవుతున్నాయట. అధికారులు ఎంపీ సహకరించ వద్దంటూ అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అందుకే ఆ మంత్రి ఫోన్ చేస్తే రెస్పాన్డ్ అవడం లేదనే గుసగుసలు పెద్దపల్లి కాంగ్రెస్ లో వినిపిస్తున్నాయి. క్యాబినేట్ విస్తరణ జరిగితే ఎలాగూ తన తండ్రి వివేక్ మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేనేందుకు తగ్గాలి అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారట ఎంపి గడ్డం వంశీ.
రాజకీయ పార్టీలు వేరైనా కరీంనగర్ లో ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే..పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి, ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య లేక పోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికైనా జిల్లా అభివృద్ధి కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి పనిచేస్తారా లేక ఇలాగే డిష్యుం డిష్యూం అంటూ నిత్యం కయ్యానికి కాలు దువ్వుతారో చూడాలి.