Telangana Rains : రెయిన్ అలర్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం.. జాగ్రత్తగా ఉండండి
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Telangana Rains
Telangana Rains : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న క్రమంలో మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణ వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం పడగా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇవాళ (ఆదివారం) కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్, వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, నారాయణపేట, నల్గొండ, ములుగు, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, గద్వాల, భూపాలపల్లి, జగిత్యాల, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కొమురంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
సోమవారం భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయని, వర్షంపడే సమయంలో బయటకు వెళ్లొద్దని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని అధికారులు సూచించారు. ఇదిలాఉంటే.. గడిచిన 24గంటల్లో అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సిరికొండలో 11.8 సెంటీమీటర్ల వర్షం పడగా.. నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లిలో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందిన టీజీడీపీఎస్ తెలిపింది.
హైదరాబాద్ నగరంలోనూ ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంది. జల్లులతోనే రోజు ప్రారంభమైంది. సాయంత్రం తరువాత పలు ప్రాతాల్లో జోరుగా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 47.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఆదివారం నగరంలోని అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.