Karimnagar Congress: ఫ్లెక్సీ ఎంత పని చేసింది? కరీంనగర్ కాంగ్రెస్‌లో వర్గపోరుకు దారితీసిన ఫ్లెక్సీ పంచాయతీ..!
ఇలా కాంగ్రెస్ పార్టీలో..ఎవరికి వారే లీడర్లన్నట్లుగా మారింది. అధికారంలో ఉన్న పార్టీ బలోపేతం కావాల్సిన చోట నేతల కయ్యాలు పార్టీని మరింత డ్యామేజ్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

Karimnagar Congress: ఓ ప్లెక్సీ వార్ నేతల మధ్య వర్గ పోరుకు దారి తీసింది. పార్టీ పరువును బజారున పడేసింది. గతంలో జిల్లా మంత్రుల మధ్య ఉన్న కోల్డ్ వార్ కాస్త…ఇప్పుడు లీడర్ల మధ్య చేరింది. అసలే కలహలతో సాగుతున్న కాంగ్రెస్ కాపురంలో..ఫ్లెక్సీ పంచాయతీ చిచ్చు రాజేయడంతో కయ్యాలు మొదలయ్యాయి. బ్యానర్‌లో ఎమ్మెల్యే బొమ్మ వేయలేదని మొదలైన లొల్లి దిష్టిబొమ్మ దగ్ధం…పాలాభిషేకాల వరకు వెళ్లింది. ఇంతకీ అధికార పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోసింది ఎవరు? పార్లమెంట్ ఇంచార్జీ ఎందుకు టార్గెట్ అయ్యారు? మంత్రులు.. ఇతర నేతలతో సఖ్యత లేదన్న పేరు..ఆ ఎమ్మెల్యేకే ఎందుకు వస్తుంది?
కరీంనగర్ కాంగ్రెస్‌లో నేతలది తలోదారి అయింది. మూడు గ్రూపులు..ఆరు వర్గాలు అన్నట్లుగా ఉంది సీన్. మొన్నటి వరకు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడిస్తే..ఇప్పుడు మానకొండూర్ ఎమ్మెల్యే..కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తీరు చర్చకు దారితీస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన వెలిచాల రాజేందర్‌రావు, కవ్వంపల్లి మధ్య అస్సలు పొసగడం లేదట. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది.
ఈ ఇద్దరి తరుపున వకాల్తా తీసుకున్న దళిత సంఘాల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లారు. సమస్యకు పుల్ స్టాప్ పెట్టాల్సిన జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివాదానికి ఆజ్యం పోశారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి ఫోటో వేయలేదని ఆయన వర్గీయులు జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీనికి ప్రతిగా వెలిచాల వర్గీయులు ఆయన ఫోటోకు పాలాభిషేకం చేశారు. బ్యానర్లు వెలిచాల ఏర్పాటు చేయలేదని అవి పార్టీకి సంబంధించినవి కాదంటూ వెలిచాల రాజేందర్ రావుతో పాటుగా..బ్యానర్లు వేసిన వాళ్లు వివరణ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందట.
ఆ పదవిపై కన్నేసిన నేతలు..!
అయితే కవ్వంపల్లి, వెలిచాల మధ్య వార్ వెనక కారణాలు వేరే ఉన్నాయనే చర్చ కాంగ్రెస్ సర్కిల్లో వినిపిస్తుంది. కరీంనగర్ అసెంబ్లి ఇంచార్జ్‌గా ఉన్న పురమల్ల శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ పదవిపై కన్నేసిన నేతలు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు.
వెలిచాలకు అసెంబ్లీ ఇంచార్జ్ తో పాటు, డీసీసీ అధ్యక్ష పదవి?
వెలిచాల రాజేందర్‌రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి మధ్య ఇంచార్జ్ పదవిపై మూడుముక్కలాట నడుస్తోంది. అయితే వెలిచాల రాజేందర్‌రావుకు అసెంబ్లీ ఇంచార్జీతో పాటు, డీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్‌ను కూడా తరచుగా వెలిచాల కలుస్తుండటంతో ఆల్మోస్ట్ ఆయనకు పదవి దక్కినట్టేనన్న టాక్ వినిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో కవ్వంపల్లి వర్గీయుల ఎపిసోడ్ హస్తం పార్టీ క్యాడర్‌ను గందరగోళానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీ వార్ ముదిరి రచ్చరంబోలా అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి ఈ గొడవకు చెక్ పెట్టాల్సి ఉండగా సైలెంట్‌గా ఉండటం చర్చకు దారితీస్తోంది. వివాదరహితుడిగా పేరున్న రాజేందర్ రావును..వ్యతిరేక వర్గం టార్గెట్ చేశారనే చర్చ మొదలైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ వెలిచాల రాజేందర్ రావుకు సపోర్ట్ చేస్తున్నారనే కారణంతో కూడా ఆయన్ను టార్గెట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే వెలిచాల వ్యతిరేక వర్గీయులే కాదు…మంత్రి పొన్నం వ్యతిరేకులంతా గొడవ చల్లారకుండ ఆజ్యం పోశారట.
ఇక మంత్రులతోనే ఢీకొన్న కవ్వంపల్లితో మాములుగా ఉండదంటున్నారట ఆయన అనుచరులు. ఇలా కాంగ్రెస్ పార్టీలో..ఎవరికి వారే లీడర్లన్నట్లుగా మారింది. అధికారంలో ఉన్న పార్టీ బలోపేతం కావాల్సిన చోట నేతల కయ్యాలు పార్టీని మరింత డ్యామేజ్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.