పక్కా ప్లాన్ తో లాయర్‌ వామన్ రావు దంపతుల మర్డర్‌

Murder

lawyer Vaman Rao couple Murder : పక్కా ప్లాన్ వేశారు. పర్ఫెక్ట్‌గా స్కెచ్ అమలు చేశారు. తమ అక్రమాలకు అడ్డుగా నిలబడిన లాయర్ వామన్ రావును, ఆయన భార్యను అత్యంత దారుణంగా అడ్డు తొలగించుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ హత్యలను తలపించే రీతిలో కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై కత్తులతో చెలరేగిపోయారు దుండగులు. వామన్ రావు కారు కోసం కాపు కాసిన దుండగులు.. నడి రోడ్డుపై కారును అడ్డం పెట్టి వామన్ రావును రోడ్డుపైకి కారు నుంచి ఈడ్చుకొచ్చారు.

వెంట తెచ్చుకున్న కత్తులతో కసితీరా నరికి నరికి చంపారు. పేగులు తెగేలా, రక్తం ఏరులై పారేలా దాదాపు పది సార్లు కత్తితో నరికారు. చుట్టూ జనాలు చూస్తున్నా.. భయం లేకుండా నిమిషాల్లోనే ఎటాక్ చేశారు. ఏం జరుగుతుందో తేరుకునే లోపే వామన్ రావుపై ఎటాక్ చేశారు. అయ్యో అని అనడమే తప్ప అక్కడ నిలబడి చూస్తున్న జనం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నోరెళ్లబెట్టి చూడటమే తప్ప.. ఆర్తనాదాలు చేస్తున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరు కూడా మందుకు రాలేదు.

దాడి జరుగుతున్న సమయంలో వెనుక రెండు బస్సుల నిండా జనం ఉన్నారు. అయినా ఒక్కరు కూడా స్పందించలేదు. బైకులపై వెళ్తున్న వారు అడ్డుకోకుండా.. ఏదో సినిమా చూస్తున్నట్లు నిలబడి చూశారు. కొంతమంది అయితే మనకెందుకులే అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంథని నుంచి పెద్దపల్లికి వెళ్తున్న లాయర్ వామన్ రావు, ఆయన భార్యను అడ్డగించిన మంథని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, అతని అనుచరులు అందరి కళ్లముందే కత్తులతో నరికి నరికి చంపారు. ఎన్నో ఏళ్ల నుంచి కసి పెంచుకున్న శ్రీనివాస్.. వామన్ రావును కారు నుంచి కిందికి దించి అందరి కళ్ల ముందే కత్తి దూశాడు. అడ్డుపడిన వామన్ రావ్ భార్యను కూడా కడతేర్చారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వామన్ రావుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వామన్ రావు తీవ్రంగా గాయపడి నడి రోడ్డుపై నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడు. తనకు సాయం చేయండి అంటూ కొన ఊపిరితో ప్రాధేయ పడ్డాడు. తనకు ఎవరైనా మంచినీళ్లు ఇవ్వడం అని, తనను ఆసుపత్రికి తరలించండి అంటూ వేడుకున్నాడు. అప్పటికే ఘటనా స్థలంలో కొంత మంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే సమయంలో వామన్ రావు తుది శ్వాస విడిచాడు.

వామన్ రావ్, నాగమణి హత్య వెనుక కుంట శ్రీనివాస్ హస్తం ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాలు విడుస్తున్న సమయంలో కూడా తనపై దాడి చేసింది కుంట శ్రీనివాస్ అని వామన్ రావు చెప్పారు. అయితే వీరిద్దరి మధ్య గొడవకు గుంజపడుగ గ్రామంలోని ఓ భూ వివాదమే కారణమని తెలుస్తోంది. 21 గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించారంటూ కొంత కాలంగా వామన్ రావు శ్రీనివాస్‌పై పోరాడుతున్నారు. గ్రామంలోని రామలయం కమిటీ ఏర్పాటుపైనా వామన్ రావు విభేదించారు. పాత కమిటీని రద్దు చేసి.. కొత్త కమిటీని కుంట శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. పంచాయతీ సర్పంచ్, పాలక వర్గం అనుమతి లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారంటూ వామన్ రావు ప్రశ్నించారు.

మరోవైపు మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ ఛైర్మన్ పుట్టా మధుతో వామన్ రావుకు విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మధు ఆస్తుల విషయంలో కూడా వామన్ రావు పోరాటం చేస్తున్నారు. మంథనిలో సంచలనం రేపిన శీలం రంగయ్య లాకప్ డెత్ కేసును కూడా వామన్ రావు వాధిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులతో పలుమార్లు వామన్ రావ్ వాగ్వాదం చేసినట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు స్థానికంగా టీఆర్ఎస్ నేతలతో వామన్ రావుకు పలు విబేధాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రాణహాని ఉందని వామన్ రావు దంపతులు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

లాయర్‌ దంపతుల హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు రామగుండం సీపీ సత్యనారాయణ. నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మంథనికి 16 కిలోమీటర్ల దూరంలో కల్వచర్ల దగ్గర మధ్యాహ్నం 2:30 కి దుండగులు వామనరావు, నాగమణి కారును ఆపి.. వారిపై కత్తులతో దాడి చేశారన్నారు సీపీ సత్యనారాయణ. బాధితులను 108లో పెద్దపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయారని తెలిపారు.