×
Ad

Musi Floods : వామ్మో.. మూసీ ఉగ్రరూపం చూశారా.. మీరెప్పుడూ ఇలా చూసిఉండరు.. వీడియో వైరల్..

Musi Floods : మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మూసీ పరిసరాల వైపు ప్రజలెవరూ రావొద్దని..

Musi Floods

Musi Floods : తెలంగాణ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వరదనీటితో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.


చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన‌పై నుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర మూసీ వరద ప్రవహించింది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. బస్టాండ్ లోకి మూసీ వరద చేరడంతో టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా ఆ బస్టాండ్ ను మూసివేసింది. ఎంజీబీఎస్ వద్ద మూసీ నదికి శనివారం ఉదయం 32వేల క్యూసెక్కుల భారీ ప్రవాహం ఉంది. 2020 తరువాత మూసీ నదికి ఇదదే అత్యధిక వరదగా అధికారులు పేర్కొంటున్నారు.


మూసీ నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూసీ పరిసరాల వైపు ప్రజలెవరూ రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి హిమాయత్ సాగర్ జలాశయం గేట్లు తెరిచారు. దీని వలన చాదర్ ఘాట్ వంతెన సమీపంలో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. పోలీసులు, అధికారులు రోడ్డును మూసివేశారు. మూసీ నది సమీపంలోని ఇళ్లు నీటమునిగాయి.


పురానాపూర్ బ్రిడ్జి వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నదీపరివాహక ప్రాంతాల్లోని ఓ శివాలయం నీటమునిగింది. మూసీ నదితోపాటు నాలాల్లో కూడా ప్రవాహం ఉధృతి పెరిగింది. దీంతో కొన్ని కాలనీలు నీటమునిగాయి. ఇలా నీటమునిగిన కాలనీల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.