Nagam Janardhan Reddy
Nagam Janardhan – Damodar Reddy : ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డితో తాను ఎలాంటి లాలూచీ పడలేదని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ‘నువ్వా నేనా ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం’ అని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డికి నాగం జనార్దన్ రెడ్డి సవాల్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు కూచుకుల్ల వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటమికి పనిచేసిన కూచుకుల్లను అధిష్టానం నమ్మొద్దన్నారు.
ఈ మేరకు గురువారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. పాపులారిటీ సర్వే ఆధారంగా టికెట్ ఇస్తామని అనడం హాస్యాస్పదమని చెప్పారు. తాను రాజ్యసభ సీటు ఒప్పుకున్నాను అన్నది తప్పుడు ప్రచారమని తెలిపారు. నాగం అంటే గుర్తు పట్టని వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నారా అని అడిగారు. కూచుకుల్ల, నాగం కలిస్తేనే గెలుస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికలు అయిపోయిన తర్వాత కూచికుల్ల తండ్రి కొడుకులు కాంగ్రెస్ లో ఉంటారన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేను తట్టుకోలేని కూచుకుల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఎలా నిలబడతాడని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసమే తాను అవినీతిపై పోరాటం చేశానని తెలిపారు.
కేసీఆర్ ఆఫర్లు ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి తమ శక్తి ఏంటో చూపిస్తామన్నారు. తాను ఎక్కడ ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. కార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.