Black Fungus Death
Black fungus Death : బ్లాక్ ఫంగస్ కేసులు తెలంగాణలో కనిపిస్తు..కలవరానికి గురిచేస్తున్నాయి. ఈక్రమంలో నల్లగొండ జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం నమోదు అయ్యింది. దీంతో జిల్లా వాసులంతా భయాందోళనలకు గురవుతున్నారు. చిట్యాల మండలం ఆరెగూడెంకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. బ్లాక్ ఫంగస్ తో హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చేరిన బాధితుడు మృతి చెందాడు.
మృతుడు గంగయ్య కొద్ది రోజుల క్రితం కరోనా నుంచి కోలుకున్నాడు. అనంతరం తిరిగి బ్లాక్ ఫంగస్ తో బాధపడుతూ గత ఐదు రోజుల క్రితం గాంధీ హాస్పిటల్ లో చేరాడు. ఈక్రమంలో చికిత్స పొందుతు మృతి చెందాడు. అయితే దీన్ని ఆ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించడం లేదు.
కాగా..గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కరోనా రోగుల్లోనూ బ్లాక్ ఫంగస్ లక్షణాలను డాక్టర్లు గుర్తించారు. గాంధీ లో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సాధారణంగా కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీనికితోడు ఆక్సిజన్ స్థాయి తగ్గిన వారికి స్టెరాయిడ్స్ ఇస్తుంటారు. అవి వ్యాధి నిరోధకశక్తిపై ప్రభావం చూపుతాయి. దానికి షుగర్ వ్యాధి తోడైతే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఎక్కువని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే బ్లాక్‌ఫంగస్ కొత్తదేమీ కాదని అంటున్నారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. తొలి దశలో కూడా గాంధీలో చికిత్స పొందిన 10 మంది కరోనా రోగుల్లో దీనిని గుర్తించామని, ఒకరిద్దరు తప్ప.. అందరూ చికిత్సతో కోలుకున్నారని తెలిపారు. కరోనా రోగులందరికీ ఇది రాదని స్పష్టం చేశారు. గాంధీలో ప్రస్తుతం ముగ్గురిలో ఈ లక్షణాలు కనిపించాయని, వారికి షుగర్ వ్యాధితో ఉండటంతో పాటు చాలా రోజులుగా ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇక్కడికి వచ్చారని తెలిపారు. కరోనా తగ్గడానికి స్టెరాయిడ్లు తీసుకున్నవారంతా బ్లాక్ ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని డాక్టర్ రాజారావు తెలిపారు. కాగా..బ్లాక్ ఫంగస్ తో తరహా లక్షణాలతో పలువురు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది.