BRS Party
ఇరవై మూడేళ్ల పార్టీ చరిత్రలో చెత్త రికార్డు మూటగట్టుకుంది బీఆర్ఎస్. తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా దక్కించుకోలేక చతికిలపడింది. గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినా..ఫలితం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికల్లో రెండంకెల స్కోరు సాధించి జాతీయ రాజకీయాల్లో తన మార్క్ వేసుకోవాలనుకున్న కేసీఆర్‌కు 2024 ఎన్నికలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో. ఏడాది క్రితం ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్..ఇప్పుడు చీకట్లో కూరుకుపోయింది. 2023లో ఇదే సమయానికి బలంగా ఉన్న గులాబీ పార్టీ..2024 ఇదే సమయానికి పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కోలుకోలేని దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి..లోక్ సభ ఎన్నికలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అయింది. ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేకపోయింది బీఆర్ఎస్.
ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయని..
అనుకున్నదొక్కటి.. అయింది ఒక్కటి అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారయ్యింది. 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయని.. ప్రధాన పార్టీలకు మెజారిటీ రాదని కేసీఆర్ రెండేళ్లుగా చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగానే జాతీయ రాజకీయాల్లో తాను చక్రం తిప్పాలని పార్టీ పేరు మార్చి.. మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ వంటి రాష్ట్రాల్లో కార్యకలాపాలను మొదలుపెట్టారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలను చేర్చుకోవడం, వారితో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయడం ప్రారంభించారు.
దీంతో పాటు..దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. అయితే కేసీఆర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు షాకిచ్చారు. కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టడంతో..ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడం అటుంచి..తెలంగాణపైనే మళ్లీ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితొచ్చింది. దీంతో కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా రెండంకెల స్కోరును సాధించాలని భావించారు.
గతంలో ఏ ఎన్నికలైనా కేసీఆర్ సభలు నిర్వహించి ప్రచారం చేసేవారు. కానీ తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో బస్సు యాత్ర చేశారు. రెండు వారాల పాటు తెలంగాణ మొత్తం బస్సు యాత్ర చేపట్టి ప్రచారం నిర్వహించారు. తన యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వస్తాయని కేసీఆర్ భావించారు.
కానీ మరోసారి ప్రజలు బీఆర్ఎస్‌కు షాకిచ్చారు. 17 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 సీట్లు దక్కించుకున్నాయి. ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇదే సమయంలో బీజేపీకి కేంద్రంలో మెజారిటీ తగ్గింది. దీంతో ఏపీలో టీడీపీ, బిహార్‌లో జేడీయూ పార్టీలు మెజారిటీ సీట్లు దక్కించుకుని ఎన్డీఏ కూటమిలో బలమైన శక్తులుగా అవతరించాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కేంద్రంలో ఎన్డీఏ సర్కారులో కీలకంగా మారాయి.
డీఎంకే కూడా..
ప్రతిపక్షంగా అవతరించిన ఇండియా కూటమిలోని భాగస్వామ్యమైన డీఎంకే కూడా గణనీయమైన ఎంపీ స్థానాలను సాధించుకుంది. అయితే ఈ ఫలితాలను పరిశీలిస్తున్న గులాబీ నేతలు.. జాతీయ పార్టీలతో కలిసి పోటీ చేసిన ప్రాంతీయ పార్టీలు.. ఆయా రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించాయన్న అభిప్రాయానికి వచ్చారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు దూరంగా ఉన్న వైసీపీ, బీఆర్ఎస్, బిజు జనతా దళ్ లాంటి పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలపడ్డాయని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీలతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగితే ఇప్పుడు పరిస్థితి మరోరకంగా ఉండేదనే చర్చ గులాబీపార్టీ వర్గాల్లో జరుగుతోంది.
మొత్తానికి తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచాడన్నట్లు తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఘోర ఓటమి అనుకుంటే..లోక్ సభ ఎన్నికల ఫలితాలు అంతకంటే దారుణమైన పరాభవాన్ని బీఆర్ఎస్ పార్టీకి మిగిల్చాయి. ఇప్పుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీ నుంచి చేజారుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకెంత మంది పార్టీకి గుడ్ బై చెబుతారో అన్న టెన్షన్ గులాబీ పార్టీలో కొనసాగుతోంది.
Also Read: ఆ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ?